పోసానికి బెయిల్.. అయినా జైలు నుంచి విడుదల కష్టమే..!

పోసానికి బెయిల్.. అయినా జైలు నుంచి విడుదల కష్టమే..!

టాలీవుడ్ ప్రముఖ నటుడు, డైరెక్టర్ పోసాని  కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరచగా 14 రోజులపాటూ రిమాండు విధించింది. అయితే సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కాస్త ఉపశమనం లభించింది. శుక్రవారం పోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసాని కృష్ణ మురళికి కడప మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది.  అలాగే పోసాని కృష్ణ మురళిని కస్డడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటీషన్‌ను కడప మొబైల్ కోర్టు డిస్మిస్ చేసింది. 

మరోవైపు విభేదాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ జనసేన నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదు మేరకు.. ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోసాని కృష్ణ మురళిని ఫిబ్రవరి నెలాఖర్లో ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. 

ALSO READ | ఏపీ హైకోర్టులో పోసానికి ఊరట..తొందరపాటు చర్యలొద్దంటూ ఆదేశాలు..

అయితే బెయిల్ వచ్చినప్పటికీ పోసాని కృష్ణ మురళి విడుదల కష్టమేనని తెలుస్తోంది. నరసరావుపేట, బాపట్ల, వైజాగ్ లలోనూ పోసాని కృష్ణ మురళీపై కేసులు ఉన్నాయి. కొన్ని కేసుల్లో ముందస్తు అరెస్టులు వద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే నరసరావుపేట కేసు విషయంలో ఇప్పటికే పోసానిని పీటీ వారెంట్ కింద రాజంపేట నుంచి పల్నాడు జిల్లాకు తరలించారు. 

ప్రస్తుతం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో బెయిల్ లభించినా.. నరసరావుపేట కేసులో మాత్రం పోసాని కొన్ని రోజులు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు బెయిల్ వచ్చింది ఓ కేసులో మాత్రమే.. మరికొన్ని కేసుల్లోనూ పీటీ వారెంట్ పై ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి.