వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్‌కు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని సురేష్‌ను ఆదేశించింది కోర్టు. అలాగే.. కేసు విచారణకు సహకరించాలని.. పోలీసులు పిలిచినప్పుడు దర్యాప్తుకు వెళ్లాలని నందిగం సురేష్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్ జైల్లో ఉన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు రానున్నారు.
అసలు కేసు ఏంటంటే..?
తుళ్లూరు మండలం వెలగపూడికి ఎస్సీ మహిళ మరియమ్మ వైసీపీ ప్రభుత్వ హాయాంలో పింఛన్ సరిగ్గా రావడం లేదని జగన్ సర్కార్‌పై విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అప్పటి ఎంపీ నందిగాం సురేష్ అనుచురులు మరియమ్మ ఇంటిపై దాడి చేయగా.. ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై 2020లో తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. అయితే, వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మృతురాలు మరియమ్మ కుమారుడు వెళ్లి మంత్రి నారా లోకేష్‌ను కలిశాడు. తన తల్లి మృతిపై న్యాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో ఈ కేసుపై ఫోకస్ పెట్టిన మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మరియమ్మ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే.. ఈ కేసులో నందిగాం సురేష్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు.
సురేష్ ప్రోద్భలంతోనే అతడి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో నందిగాం సురేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. దాదాపు ఐదు నెలల పాటు జైల్లో ఉన్న సురేష్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. సుప్రీం కోర్టును ఆశ్రయించనా ఊరట దక్కలేదు. చివరకు మంగళగిరి కోర్టు సురేష్‌కు ఈ కేసులో బెయిల్ ఇచ్చింది.