
హనుమకొండ జిల్లాలో బైరి అగ్నితేజ్ ను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బైరి నరేష్ ను సమర్ధిస్తూ అయ్యప్ప స్వామిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు. అగ్నితేజ్ పోస్టులపై కమలాపూర్ పీఎస్ లో కేసు నమోదైంది. అప్పటి నుంచి అగ్నితేజ్ పరారీలో ఉన్నాడు. ఆదివారం అతడిని అరెస్ట్ చేశారు. బైరి అగ్నితేజ్ బైరి నరేష్ కు సమీప బంధువు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడితే కేసులు పెడతామన్నారు పోలీసులు.
నరేశ్ ను వారం రోజులపాటు పోలీసులు కస్టడీలోకి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ కు కోర్టు14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నరేష్ ను భారీ భద్రతతో పరిగి సబ్ జైలుకు తరలించారు. వరంగల్ లో నరేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కొండగల్ కోర్టులో హాజరుపర్చారు. నరేశ్ ను తరలించిన పరిగి జైలుకు అయ్యప్ప స్వాములు చేరుకున్నారు. జైలు లోపలికి వెళ్లేందుకు స్వాములు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు.