బైరి నరేశ్‌‌ బంధువు అగ్నితేజ్ అరెస్ట్

బైరి నరేశ్‌‌ బంధువు అగ్నితేజ్ అరెస్ట్

కమలాపూర్/వికారాబాద్, వెలుగు: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌‌ అరెస్ట్‌‌ను ఖండిస్తూ అతని సమీప బంధువు అగ్నితేజ్ ఫేస్‌‌బుక్‌‌లో వివాదాస్పద పోస్టు చేయడంతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతినేలా నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్‌‌ కామెంట్‌‌ చేయగా మండిపడ్డ అయ్యప్ప భక్తులు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. దీంతో నరేశ్‌‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నరేశ్‌‌కు సపోర్టుగా ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్‌‌ పెట్టిన అగ్నితేజ్‌‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ సంజీవ్​మాట్లాడుతూ, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

వేదిక మీద ఉన్న వారందరిపై కేసు పెట్టాలె..

అయ్యప్ప స్వామిపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌‌పై ఉన్న పాత కేసులను పరిగణనలోకి తీసుకుని అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర అయ్యప్ప ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్‌‌ చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నరేశ్‌‌పై ఫిర్యాదు చేసి, మీడియాతో మాట్లాడారు. బైరి నరేశ్‌‌కు సహకరించిన రేంజర్ల రాజేశ్‌‌తో పాటు వేదికపైన ఉన్న అందరిపైనా కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామిపై నరేశ్‌‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వేదికపై కూర్చొని వెటకారంగా నవ్వుతూ, సమర్థించిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొడంగల్ నియోజకవర్గంలోని రావులపల్లిలో సభ జరిగిన చోట పాలతో శుద్ధి చేస్తామని తెలిపారు.