బెయిర్‌ స్టో రనౌట్ వివాదం: పాలు తాగుతోన్న బుల్లి 'బెన్ స్టోక్స్'

బెయిర్‌ స్టో రనౌట్ వివాదం: పాలు తాగుతోన్న బుల్లి 'బెన్ స్టోక్స్'

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్‌గా మారుతోంది. క్యాచ్ ఔట్‍లు, రనౌట్‌లు, ఆటగాళ్ల సెలెబ్రేషన్స్.. ఇలా మ్యాచ్‌లో చోటుచేసుకునే ప్రతి ఒక సంఘటన వివాదాలకు దారితీస్తోంది. వీటికి తోడు రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔటైన తీరు ఇరుదేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి తీసుకెళ్లింది.

'క్రీడా స్ఫూర్తిని మరిచి ఆసీస్ విజయం సాధించింది' అని ఇంగ్లండ్ మీడియా చెప్తుండగా.. 'ఓటమిని అంగీకరించకుండా చిన్న పిల్లల మాటలు మాట్లాడకండి..' అని ఆసీస్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మీడియా.. బెన్ స్టోక్స్‌ను, స్టోక్స్ బృందాన్ని(ఇంగ్లండ్ జట్టు) 'క్రై బేబీస్'గా చిత్రీకరించడం ఈ వివాదానికి మరింత ఆద్యం పోస్తోంది.

పాలు తాగుతున్న స్టోక్స్

మ్యాచ్ అనంతరం బెయిర్ స్టో ఔట్ పై స్పందించిన స్టోక్స్.. నిబంధనల ప్రకారం అది ఔటైనా, ఒకరకంగా ఛీటింగేనని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి గెలుపు తనకు అవసరం లేదని.. ఈ పద్దతిలో తాను మాత్రం ఎప్పుడు విజయాన్ని అందుకోనని తెలిపారు. ఈ విమర్శలను తట్టుకోలేని ఆసీస్ మీడియా(ది వెస్ట్ ఆస్ట్రేలియన్ దినపత్రిక).. ఇంగ్లండ్ జట్టును 'Crybabies'గా వర్ణిస్తూ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో స్టోక్స్ పాలు తాగుతున్నట్లు ఫొటోను క్రియేట్ చేశారు. 

తాను కాదంటోన్న బెన్ స్టోక్స్

ది వెస్ట్ ఆస్ట్రేలియన్ దినపత్రిక ప్రచురించిన కథనానికి స్టోక్స్ అదే రీతిలో కౌంటరిచ్చారు. అందులో ఉన్నది తాను కాదని చెప్తున్నారు. "ఖచ్చితంగా అది నేను మాత్రం కాదు.. ఎందుకంటే అంత చిన్న వయసులో నేనెప్పుడు కొత్త బంతితో బౌలింగ్ చేయలేదు.." అని వ్యంగ్యస్త్రాలు సంధించారు.

కాగా, ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆసీస్.. రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఇరు జట్ల మధ్య హెడింగ్లీ వేదికగా జూలై 6 నుంచి మూడో టెస్ట్ ఆరంభం కానుంది.