న్యూఢిల్లీ: దేశీయ, ఎగుమతి మార్కెట్‌లలో పటిష్టమైన అమ్మకాల వల్ల ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో పన్ను తర్వాత లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం పెరిగి రూ.1,942 కోట్లకు చేరుకుందని బజాజ్ ఆటో మంగళవారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ క్వార్టర్లో రూ.1,644 కోట్ల పన్ను తర్వాత లాభాన్ని (పీఏటీ) ప్రకటించింది.
గత మొదటి క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.10,312 కోట్లు కాగా, ఈసారి ఇది రూ.11,932 కోట్లకు పెరిగింది. స్టాండెలోన్ ప్రాతిపదికన, కంపెనీ రూ. 1,988 కోట్ల నికరలాభాన్ని నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 1,665 కోట్లతో పోలిస్తే లాభం 19 శాతం పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.10,310 కోట్లు కాగా, ఈసారి రూ.11,928 కోట్లకు పెరిగింది.
తొలి క్వార్టర్లో మొత్తం అమ్మకాలు 10,27,407 యూనిట్ల నుంచి 7 శాతం వృద్ధితో 11,02,056 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయ మార్కెట్‌లో 6,90,621 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది కాలంతో పోలిస్తే ఎనిమిది శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో 3,85,851 యూనిట్లతో పోలిస్తే జూన్ క్వార్టర్లో ఎగుమతులు ఏడాదికి 7 శాతం పెరిగి 4,11,435 యూనిట్లకు చేరుకున్నాయి.
తమ వద్ద రూ. 16,764 కోట్ల మిగులు నగదు ఉందని, భవిష్యత్ వృద్ధి పెట్టుబడులకు దీనిని వాడుతామని కంపెనీ తెలిపింది.