న్యూఢిల్లీ: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తన రూ. 6,560 కోట్ల తన ఐపీఓ కోసం ఒక్కో షేరు ధరను రూ. 66–-70 మధ్య నిర్ణయించినట్లు మంగళవారం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ఈ నెల 9–11 తేదీల మధ్య ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం వేలం సెప్టెంబర్ 6న జరుగుతుంది. ఐపీఓలో రూ. 3,560 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది. పేరెంట్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ద్వారా రూ. 3,000 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటుంది. ఆర్బీఐ రూల్స్ప్రకారం.. సెప్టెంబర్ 2025 నాటికి ఎగువ-స్థాయి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్చేయాలి కాబట్టి ఈ వాటా విక్రయం జరుగుతోంది.
తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని భవిష్యత్ మూలధన అవసరాలను తీర్చడానికి, కంపెనీ మూలధనాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇదిలా ఉంటే, ఆటో విడిభాగాల తయారీ సంస్థ క్రాస్ రూ. 500 కోట్ల విలువైన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను ఈ నెల 9–11 తేదీల్లో నిర్వహించనుంది. జంషెడ్‌పూర్‌కు చెందిన ఈ కంపెనీ ఐపీఓలో రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూతోపాటు ప్రమోటర్ల ద్వారా రూ. 250 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది.