వాలెంటైన్స్ డేను ఎంతో అద్భుతంగా జరుపుకుందామని అనుకుంటారు ప్రేమికులు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రేమికులు, ప్రేమలోకంలో మునిగితేలుతారు. తమ ప్రేమను ఎదుటివారికి తెలిపేందుకు యువతీ యువకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. స్పెషల్ బహుమతులతో ఒకరికొకరు తమ ప్రేమను పంచుకోవాలని బావిస్తుంటారు. తమ ప్రేమను పంచుకోవడానికి పార్కు, హోటల్స్, రిసార్ట్స్ వంటి చోట్లు ఎంపిక చేసుకుంటారు. ప్రేమ విహారంలో మునిగి తేలేందుకు సిద్ధమౌతుంటారు.
ఈ క్రమంలోనే హిందూ సంఘాలు ప్రేమికులకు గట్టి వార్నింగ్ ఇచ్చాయి. విదేశీ సంస్కృతిని, ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించడానికి వీల్లేదని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ప్రకటించాయి. ప్రేమ జంటలు ఎక్కడైన కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని హెచ్చరించాయి. నకిలీ ప్రేమను ప్రోత్సహించే వాలెంటైన్స్ డే ను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్ ప్రకటించాయి. విదేశీ విష సంస్కృతిని వీడి భారతీయ విలువలు, సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షిద్దామని సంఘాల నేతలు తెలిపారు.
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ను బహిష్కరించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. ప్రేమికుల రోజును అడ్డుకుంటామని, పార్కులు.. హోటళ్లు.. విహార స్థలాలు.. రకరకాల ప్రదేశాల్లో సంచరించే కల్తీ ప్రేమికులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రేమ పేరుతో అశ్లీలతను పెంపొందించి, విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్న కార్పోరేట్ శక్తుల కుట్రలకు బలికావద్దని యువతకు సూచించారు. సీతారాముల ప్రేమను ఆదర్శంగా తీసుకొని యువత ఆదర్శ జీవితం కొనసాగించాలని వారు సూచించారు.
దేశం కోసం.. ధర్మం కోసం పరితపించేలా ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు అలవర్చుకోవాలని హిందూ సంఘాల నాయకులు తెలిపారు.2019, ఫిబ్రవరి 14 న పుల్వామాలో జరిగిన ఘటన ఆధారంగా ఆ రోజు వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. "ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల రోజు కాదని.. అమరవీరుల సంస్కరణ దినం" నిర్వహించాలని సూచించారు.