
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డిని బరిలో దింపనున్నట్లు వెల్లండిచారు. కాగా.. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేతిలో ఆమె ఓడిపోయారు. ఈ సారి ఆమెకు బదులుగా బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డికి టికెట్ కేటాయించారు కేసీఆర్.
అంతకుముందు చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్యలను లోక్‌సభ అభ్యర్థులుగా వెల్లడించారు. వాస్తవానికి వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరును కేసీఆర్ ప్రతిపాదించారు. కానీ పోటీ చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆయనను ఒప్పించేందుకు పార్టీ లీడర్లు ప్రయత్నం చేసినప్పటికీ నో అనే చెప్పారు. దీంతో కడియం కావ్య పేరును కేసీఆర్ ఫైనల్ చేశారు.
ఇక చేవెళ్ల నుంచి మరోసారి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీ రజింత్ రెడ్డి ఆసక్తి చూపించకపోవడంతో కాసాని జ్ఞానేశ్వర్ ను బరిలో దించారు కేసీఆర్. గతేడాది అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు కాసాని.