- ఉద్యోగులు, కార్మికులతో అనుబంధం మరువలేనిది
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఇదే చివరి కార్యక్రమమని.. కార్మికులు, అధికారులు, ఉద్యోగులతో అనుబంధం మరువలేనిదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవుతున్న సందర్భంగా సంస్థలో ఉద్యోగులకు ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం బస్ భవన్ లో 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాజిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లేందుకు తాను, ఎండీ సజ్జనార్ ఎంతో కృషి చేశామన్నారు. ప్రభుత్వంలో విలీనం అవుతున్న సందర్భంగా తాను చైర్మన్ గా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సంస్థలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. వారి కృషి వల్లనే సంస్థకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఆర్టీసీ సమస్యలను సీఎం, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవితల దృష్టికి తీసుకెళ్లానన్నారు.
ప్రస్తుత కాలానికి అనుగుణంగా ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు, వెహికల్ లొకేషన్, ట్రాకింగ్ సిస్టమ్, ఫైర్ డిటెన్షన్, అలారం, తదితర అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన సూపర్ లగ్జరీ, స్లీపర్ బస్సులను ప్రారంభించుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎండీ సజ్జనార్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్ లతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.