పద్మశ్రీని వాపస్ ఇస్తున్నా
- మోదీ ఇంటి ముందు ఫుట్‌పాత్‌పై అవార్డును ఉంచిన రెజ్లర్ బజ్‌రంగ్
- డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా బ్రిజ్ సన్నిహితుడు సంజయ్ ఎన్నికపై నిరసన
న్యూఢిల్లీ: ఇండియా రెజ్లింగ్‌లో వివాదాలకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా లేదు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రెసిడెంట్‌గా ఎన్నికవడంపై నిరసనగా స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును కేంద్రానికి వాపస్ ఇచ్చేశాడు. తన ప్రతిభకు గుర్తింపుగా లభించిన దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానికి తిరిగిచ్చేస్తానంటూ శుక్రవారం కర్తవ్యపథ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్తున్న బజ్‌రంగ్‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, పద్మశ్రీ అవార్డును ప్రధాని ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పై పెట్టి వెళ్లిపోయాడు.
‘ప్రభుత్వం నుంచి నేను ఈ గౌరవాన్ని అందుకున్నా. అయితే ఈ గౌరవం ఉన్నప్పటికీ నేను ఈ దేశ పుత్రికల గౌరవాన్ని కాపాడలేకపోయాను. కాబట్టి ఈ అవార్డును ఉంచుకునే అర్హత నాకు లేదు. పీఎంను కలిసేందుకు నేను ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతున్న దానిలో నిజం ఉంది. అందుకే ఆయనను కలువలేపోతున్నా. పద్మశ్రీ అవార్డును నేలపై ఉంచలేను కాబట్టి ఈ లెటర్ (మోదీకి రాసిన)పై పెట్టి వెళ్తున్నా. దీన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లలేను. మహిళా రెజ్లర్ల స్వరం ఇంకా మీకు (మోదీ) చేరలేదు. భవిష్యత్తులో అది మీకు చేరినట్లయితే దయచేసి వారికి న్యాయం చేయండి’ అని బజరంగ్ పేర్కొన్నాడు.
రియో ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతి రోజే బజ్‌రంగ్ తీసుకున్న నిర్ణయం దేశ క్రీడా రంగంలో సంచలనంగా మారింది. కాగా, గురువారం జరిగిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో సంజయ్ ప్రెసిడెంట్‌గా గెలవగా, అతని ప్యానెల్ 15 పోస్టుల్లో 13 గెలుచుకుంది. ఈ ఫలితాలపై స్టార్ రెజ్లర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సాక్షి ఇంటికి ప్రియాంక గాంధీ
రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మాలిక్‌ను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. సాక్షికి, అక్కడే ఉన్న బజ్‌రంగ్‌కు సంఘీభావం ప్రకటించారు. ఒక మహిళగా తాను సాక్షి దగ్గరకు వచ్చానని ప్రియాంక తెలిపారు. కాగా, బజ్‌రంగ్ చర్యపై కేంద్ర క్రీడా శాఖ స్పందించింది. అవార్డులు వాపస్ ఇవ్వాలనేది వ్యక్తిగత విషయం అయినప్పటికీ దీనిపై పునరాలోచించేలా బజ్‌రంగ్‌ను ఒప్పించడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.
మహిళా రెజ్లర్లకు న్యాయం జరగడం లేదు : పునియా
2019లో పద్మశ్రీ అందుకున్న బజ్‌రంగ్ ఈ అవార్డును వాపస్ చేయడానికి కారణాలను వివరిస్తూ మోదీకి లెటర్ రాశాడు. ‘బ్రిజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఏప్రిల్‌లో మేం మరోసారి ఢిల్లీ వీధుల్లో నిరసన చేపట్టిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. దాదాపు 40 రోజుల తర్వాత నిరసన ప్రాంతాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మా పతకాలను గంగా నదిలో పడేద్దామని మేమంతా 19న హరిద్వార్ వెళ్లాం. కానీ, అక్కడ రైతు నేతలు, కోచ్‌లు మమ్మల్ని నిలువరించారు. అదే సమయంలో మీ క్యాబినెట్‌లోని ఓ మంత్రి మమ్మల్ని పిలిచి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మేం నిరసన విరమించాం. కానీ, ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్‌ఐ మరోసారి బ్రిజ్ భూషణ్ ఆధీనంలోకి వెళ్లింది. తాను ఎప్పటిలాగే ఫెడరేషన్‌ను ఏలుతానని బ్రిజ్ సైతం ప్రకటించడంతో విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రభుత్వం మాకు చాలా ఇచ్చింది. 2019లో నాకు పద్మశ్రీ అవార్డు లభించింది. అర్జున, ఖేల్ రత్న అవార్డులు కూడా అందుకున్నా. నేను ఈ అవార్డులను పొందినప్పుడు ఆనందంతో పొంగిపోయాను. కానీ ఈ రోజు నా మనసంతా విచారంగా, బరువుగా ఉంది. ఒక మహిళా రెజ్లర్ తన భద్రతపై ఆందోళన కారణంగా ఈ ఆటనే విడిచిపెట్టింది. క్రీడలు మన మహిళా అథ్లెట్లకు సాధికారతను అందించి, వారి జీవితాలను మార్చాయి. కానీ, ఇప్పుడు వాళ్లు క్రీడను విడిచిపెడుతుంటే అవార్డులు పొందిన రెజ్లర్లం ఏమీ చేయలేకపోతున్నాం. మా మహిళా రెజ్లర్లకు అవమానం జరుగుతుంటే నేను పద్మశ్రీ అవార్డీగా నా జీవితాన్ని గడపలేను. అందుకే ఈ అవార్డును మీకు వాపస్ ఇచ్చేస్తున్నా’ అని బజరంగ్ లేఖలో పేర్కొన్నాడు.