Mohammad Rizwan: రిజ్వాన్‌కు జీతం దండగ.. పాక్ క్రికెట్ బోర్డును అవమానించాడు: మాజీ పేసర్

Mohammad Rizwan: రిజ్వాన్‌కు జీతం దండగ.. పాక్ క్రికెట్ బోర్డును అవమానించాడు: మాజీ పేసర్

పాకిస్థాన్ క్రికెట్ లో వివాదాలకు కొదువ లేదు. ఆ జట్టుపై ఎవరో ఒకరు ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లే ఆ జట్టుపై మండిపడతారు. ఇటీవలే సొంతగడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా విఫలం కావడంతో సొంత జట్టుపై ఆ దేశ అభిమానులే తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ వన్డే కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ పై ఆ జట్టు మాజీ పేసర్ సికందర్ బఖ్త్  సంచలన ఆరోపణలు చేశాడు. అతడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డును అవమానిస్తున్నాడని హాట్ కామెంట్స్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో ఓడిపోయిన అనంతరం సికందర్ బఖ్త్ ఈ విధంగా అన్నాడు. 

"పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఆటగాళ్లకు రూ. 60 లక్షలు జీతం వస్తుంది. కాబట్టి వారు బోర్డు నిర్వహిస్తున్న టోర్నమెంట్లలో ఖచ్చితంగా ఆడాలి. ఆటగాళ్ళందరూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మీరు క్లబ్ క్రికెట్ ఆడుతూ బోర్డు నిర్వహించే టోర్నమెంట్ ఆడకపోతే, మీరు పాకిస్థాన్ క్రికెట్ బోర్డును అవమానిస్తున్నారని అర్థం. ఇలా జరగకుండా ఆటగాళ్లపై మొహ్సిన్ నఖ్వీ కఠినంగా ఉండాలి. అతను మర్యాద గల వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ అతను తన పద్ధతులను మార్చుకోవాలి. ఏమి జరుగుతుందో అడగాలి. కఠినంగా ఉండండి. ఇలా చేస్తే ప్లేయర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లను ఆపండి". అని బఖ్త్ జియో సూపర్‌తో అన్నారు.

Also Read :- బలహీనంగా ముంబై.. వాళ్ళు లేకుండానే చెన్నైతో మ్యాచ్

రిజ్వాన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే జాతీయ టీ20 కప్‌లో పాల్గొనడానికి బదులుగా క్లబ్ క్రికెట్ ఆడటానికి ప్రాధాన్యమిచ్చాడు. అతని చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన తర్వాత రిజ్వాన్ ఇప్పటికీ  విమర్శలకు గురవుతున్నాడు. రిజ్వాన్ కెప్టెన్సీలో ఆ జట్టు ఒక్క మ్యాచ్  గెలవకుండా గ్రూప్ దశలోనే ఓడిపోయింది. దీంతో అతన్ని పాకిస్థాన్ టీ20 జట్టు నుంచి తప్పించారు. ప్రస్తుతం రిజ్వాన్ న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. మూడు వన్డేల ఈ సిరీస్ మార్చి 29 నుంచి ప్రారంభం కానుంది.