ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్​ నిధులు పక్కదారి పట్టిస్తే చర్యలు : బక్కి వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్​ నిధులు పక్కదారి పట్టిస్తే చర్యలు : బక్కి వెంకటయ్య
  • స్టేట్​ఎస్సీ, ఎస్టీ కమిషన్ ​చైర్మన్  బక్కి వెంకటయ్య 

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​ నిధులు పక్కదారి పట్టిస్తే సీరియస్ ​యాక్షన్​ తీసుకుంటామని స్టేట్​ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్ ​బక్కి వెంకటయ్య ఆఫీసర్లను హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ కేసులు, ల్యాండ్​ వివాదాలు, బ్యాక్​ లాగ్​ పోస్టుల భర్తీ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు శాఖల ఆఫీసర్లతో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​లో ఆయన మంగళవారం ఆయన వేర్వేరుగా రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఖమ్మంలో మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ జీఎస్ ​పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంగన్​వాడీ కేంద్రాలకు రూ.5కోట్ల నుంచి 10 కోట్లతో  కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తుందని తెలిపారు. జిల్లాలో అద్దె భవనాల్లో ఉన్న 300 అంగన్​వాడీ కేంద్రాలకు మార్చి నాటికి  సొంత భవనాలు మంజూరు చేయించుకోవాలని సూచించారు. కిచెన్ గార్డెన్ ల ఏర్పాటు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఇంగ్లీష్​  పరిజ్ఞానం పెంపునకు చర్యలు చేపడుతున్న కలెక్టర్ ముజామ్మిల్​ఖాన్​ను అభినందించారు.

జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేయాలన్నారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రెవెన్యూ సంబంధించి 40 ఎస్సీ, ఎస్టీ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, నెల రోజుల్లో వీటిని పరిష్కరిస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి మొత్తం 41 ప్రీ మెట్రిక్, 11 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద 8 పాఠశాలలు, 6 కార్పొరేట్ కళాశాలల్లో బలహీన వర్గాల పిల్లలకు విద్య అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 13 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఉన్నాయని, వీటిలో 8,105 మంది విద్యార్థులు చదువుతున్నారని, 8 సొంత, 6 ప్రైవేట్ భవనాల్లో ఈ కళాశాలలు నడుస్తున్నాయని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 8 రెసిడెన్షియల్ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు.

 మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,322 దళిత బంధు యూనిట్లు గ్రౌండ్ చేసుకున్నామని, వీటి పని తీరుపై ఇటీవలే సర్వే నిర్వహించి 1,400 యూనిట్లు డైవర్ట్ అయిన్నట్టు గుర్తించామన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పెరిగిన పడకల సంఖ్య ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు జరుగనందున పారిశుధ్య సిబ్బందికి వేతనాలు పెండింగ్ ఉన్నాయని, ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ కమిషన్ తరఫున వచ్చిన పిటీషన్లను సంపూర్ణంగా విచారించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రతి సంవత్సరం 90 కేసుల వరకు వస్తున్నాయని, వీటిని విచారించి సకాలంలో ఛార్జీ షిట్ నమోదు చేస్తున్నామని  చెప్పారు.

కొత్తగూడెంలో...

రివ్యూ మీటింగ్​కు వచ్చేటప్పుడు పూర్తి స్థాయి నివేదికలతో రాకపోతే ఎట్లా అంటూ స్టేట్​ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​బక్కి వెంకటయ్య ఆఫీసర్లపై అసహనం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో జిల్లాలో అట్రాసిటీ, భూ వివాదాల కేసులు పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. కొత్తగూడెంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు కృషి చేస్తానన్నారు. భద్రాచలంలో మొబైల్​కోర్టుకు జడ్జీని నియమించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతినెలా సివిల్​ రైట్స్​డేను పక్కాగా నిర్వహించాలన్నారు.

ఏడాదిలో నిర్వహించే మీటింగ్​ల షెడ్యూల్​ ముందే తయారు చేసుకోవాలని చెప్పారు. మంత్రాలు, మూఢ నమ్మకాల పేర ఇటీవల హత్యలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్​ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు స్కిల్​ డెవలప్​మెంట్​పై ట్రైనింగ్​ ఇవ్వడంతో పాటు ప్రైవేటు పరిశ్రమల్లో రిజర్వేషన్​ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్​వాడీ కేంద్రాల్లో కరెంట్​ సౌకర్యం కల్పించాలని చెప్పారు. అనంతరం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్​ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన లైజన్​ ఆఫీస్​ను బక్కి వెంకటయ్య ప్రారంభించారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై డైరెక్టర్​ జి. వెంకటేశ్వరరెడ్డి, జీఎం పర్సనల్​ కవితాయ నాయుడితో చర్చించారు. సింగరేణిలోని ఎస్సీ, ఎస్టీ సంఘాల్లో విభేదాలు ఉండడం దారుణమన్నారు. వారి సమస్యల పరిష్కారంపై కంపెనీ చైర్మన్​తో చర్చిస్తానని చెప్పారు.  ఖమ్మంలో అడిషనల్​ కలెక్టర్లు డాక్టర్ పీ. శ్రీజ, పీ. శ్రీనివాస రెడ్డి, అడిషనల్​ డీసీపీ నరేశ్ ​కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కే. సత్యనారాయణ,  కొత్తగూడెంలో కమిషన్​మెంబర్లు రాంబాబు నాయక్​, నారాయణ, ప్రవీణ్​, కలెక్టర్​ జితేశ్​వి పాటిల్, ఎస్పీ బి. రోహిత్​ రాజు, ఐటీడీఏ పీవో రాహూల్, అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్, డీఆర్​డీవో పీడీ విద్యాచందన, డీఎఫ్​వో కిష్టాగౌడ్, ఆర్టీవోలు మధు, దామోదర్​, ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు లక్ష్మీబాయి, రవి కుమార్​, లావుడియా సామ్యా, లకావత్​ వెంకటేశ్వర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.