కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఇటీవల దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనలో బాధితురాలికి అండగా నిలుస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఘటనా పూర్వాపరాలు తెలుసుకునేందుకు శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్‌లో డీఎస్పీ ప్రకాశ్‌తో సమావేశమై కేసు ఎంక్వైరీ గురించి మాట్లాడారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చెప్పగా..మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయాలన్నారు. సఖి సెంటర్లో ఉన్న బాధితురాలిని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ ఘటనపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించి, బాధితురాలికి ఉపాధి కల్పించేలా కమిషన్ చూస్తుందన్నారు. బాధిత మహిళకు దళిత సంఘాలు కూడా అండగా ఉంటాయన్నారు. కమిషన్ మెంబర్ నేనావత్ రాంబాబు నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, అంబేద్కర్ సంఘం జిల్లా ప్రెసిడెంట్ఆకుల బాబు, ఎమ్మార్పీఎస్‌జిల్లా ప్రెసిడెంట్ భూమయ్య, ప్రతినిధులు బాలరాజు, లక్ష్మి పాల్గొన్నారు.