త్యాగాలకి ప్రతీక బక్రీద్ పండుగ. దీనినే‘ఈదుల్ అజ్హా’, ‘బకర్ ఈద్’ అని కూడా పిలుస్తారు. ఈదుల్ ఫితర్ పండుగ( రంజాన్) జరిగిన రెండు నెలలకు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం పన్నెండవ నెల‘జిల్హాజ్’లో వస్తుంది ఈ పండుగ. ఈరోజు ముస్లిం సోదరులంతా తమకున్నదాంట్లో కొంత భాగాన్ని పేదలకి దానం చేసి అల్లాహ్ని ఆరాధిస్తారు. త్యాగాలకి ప్రతిరూపమైన ఈ పండుగ విశిష్టత గురించి మరిన్ని విషయాలు.
ఖురాన్ ప్రకారం కొన్ని వేల యేళ్ల కిందట అల్లాహ్ భూమ్మీదకి ఒక లక్షా ఇరవైనాలుగు వేల మంది ప్రవక్తల్ని పంపించాడు. లోకాన్ని సన్మార్గంలో నడిపించేందుకు భూమ్మీదకి వచ్చిన ఆ ప్రవక్తల్లో ఒకరు హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం. ఇబ్రహీం విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒకరోజు అల్లాహ్ అతని కలలో కనిపించి ‘నీ కొడుకుని నాకు బలివ్వమ’ని ఆదేశిస్తాడు. తెల్లారి హజ్రత్ తన కలని కొడుకు ఇస్మాయిల్కి చెప్పడంతో అల్లాహ్పై ఉన్న భక్తితో అతనూ బలికి సిద్ధమవుతాడు. సరిగ్గా బలిస్తున్న టైంలో అల్లాహ్ ఇస్మాయిల్ స్థానంలో గొర్రె పొట్టేలును ప్రత్యక్షం చేస్తాడు. అప్పటినుంచి ఆరోజుని బక్రీద్గా జరుపుకుంటున్నారు.
త్యాగం చేస్తారు
ఈరోజు ముస్లిం సోదరులంతా ఉదయం ఆరింటికి నమాజ్కి బయలుదేరతారు. ప్రత్యేక నమాజు, తక్బీర్ చదువుతారు. ఏడాది వయసున్న ఆరోగ్యకరమైన పొట్టేలును అల్లాహ్కి బలిస్తారు. ఆర్థిక స్థోమత ఉన్న ప్రతీ ముస్లిం గొర్రెను బలివ్వాలని ఇస్లాం చెప్తోంది. ఆ మాంసాన్ని మూడు భాగాలు చేసి...మొదటిది పేదలకి, రెండోది బంధువులకు, చివరిది తమ కుటుంబానికి పంచుతారు. ఖుర్బానీ మాంసాన్ని ఇతర మతాల వాళ్లకి కూడా పంచుతారు ముస్లిం సోదరులు. దాని ద్వారా మనుషులంతా ఒక్కటేనని చాటిచెప్తారు. అలాగే ఈరోజు పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వాళ్ల సమాధుల దగ్గరకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
హజ్ యాత్ర చేయాలంటే..
ముస్లింలు ఈ మాసంలోనే హజ్ యాత్రకి వెళ్తారు. సౌదీ అరేబియాలోని మక్కాకి వెళ్లి ‘కాబా’ గృహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. అయితే హజ్ యాత్రకు వెళ్లాలనుకునే ముస్లింలు మొదట దీక్ష తీసుకుంటారు. మక్కా వెళ్లాలనుకునేవాళ్లకి ఎలాంటి దుర్బుద్ధి, దురుద్దేశం, కీర్తి ప్రతిష్టల కోరికలు ఉండకూడదు. హజ్ యాత్రకు ఉపయోగించే డబ్బు న్యాయంగా సంపాదించిందై ఉండాలి. వడ్డీ, జూదం, లాటరీ, లంచం, దొంగతనం, ఇతర అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుతో హజ్ యాత్ర చేయడం పాపమని ఇస్లాం చెప్తోంది. - షౌకత్ అలీ, మెట్పల్లి, వెలుగు