కర్నూలు: బాల సాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పాతబస్టాండులో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న బాలసాయి బాబా మందిరంలో శ్రీ భగవాన్ బాలసాయి బాబా 61 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్నారు. కులమతాలకు అతీతంగా సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి భగవత్ స్వరూపం బాల సాయి బాబా అని కొనియాడారు. భౌతికంగా మన ముందు లేకపోయినా ఆశయాలు సేవా దృక్పథం మన ముందు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని, అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
మానవసేవే మాధవసేవ: ఎమ్మెల్యే యం.ఎ హఫీజ్ ఖాన్
భగవాన్ బాల సాయిబాబా 61 వ జన్మదిన వేడుకల కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పలుచోట్ల విద్యా సంస్థలు స్థాపించి ఉచిత విద్యను అందించిన బాల సాయిబాబా ట్రస్టుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ట్రస్ట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగిస్తూ ఉచిత విద్య తో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తుండడం అభినందనీయమని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా మానవసేవే మాధవసేవగా పరిగణిస్తూ నిరుపేదలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సొంత ఉపాధి వ్యాపారం నిమిత్తం తోపుడు బండ్లు పంపిణీ చేయడం ఆదర్శకరం అన్నారు.
కర్నూలు నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ బాలసాయి బాబా సేవ కార్యక్రమాలు చిరస్మరణీయం అని కొనియాడారు.
వేడుకల్లో భాగంగా ఓమ్నీ, అమ్మ హాస్పిటల్స్ వారు ఉమ్మడిగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అలాగే ప్రముఖ కళాకారులచే భరత నాట్యము, కూచిపూడి, పేరిని శివతాండవ నృత్య ప్రదర్శన తదితర సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంత అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి, ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాష, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, పీఆర్వో శ్రీనివాస్, వివిధ పార్టీలు, ఉద్యోగ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.