
నేటి టెక్నాలజీ రంగంలో చాలా మనం కూడా మనుషులమే అన్న సంగతే మర్చిపోతున్నారు. బంధాలకు, బంధుత్వాలకు విలువనివ్వకుండా.. కన్న తల్లిదండ్రులను కూడా చూడకుండా స్వార్థంతో డబ్బు వెనక పరిగెడుతున్నారు. కానీ ఎంత సంపాదించినా.. ఏం చేసినా.. తల్లిదండ్రుల ప్రేమను కొనలేమని, రక్త సంబంధాలను మర్చిపోరాదని.. "తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.." అంటూ 'బలగం' సినిమాలో ఒక్క పాటతోనే అందర్నీ ఏడిపించిన మొగిలి కొమురమ్మ దంపతులు కష్టాల్లో కూరుకుపోయారు. అనారోగ్య సమస్యలతో ఇటీవలే ఆస్పత్రిలో చేరిన మొగిలయ్య.. చికిత్స పొందుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఓ పక్క కిడ్నీ.. మరో పక్క గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య సమస్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులూ ఆ కుటుంబాన్ని ఊపిరి నలపకుండా చేస్తున్నాయి. కిడ్నీ వ్యాధిన పడ్డ మొగిలయ్యకు ఇప్పటికే కండ్లు కూడా సరిగా కనిపించడం లేదు. 'బలగం' సినిమాలో తన పాటతో కోట్లాది మంది హృదయాలను కదిలించిన మొగిలి -కొమురమ్మ దంపతుల దీన గాథ ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలనూ కదిలిస్తోంది.
ప్రముఖ కమెడియన్ టిల్లు వేణు దర్శకత్వంలో వచ్చిన 'బలగం' మూవీ ఫేమ్ మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం వరంగల్ లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ వ్యాధితో పాటు ఆయనకు గుండెకు సంబంధించిన వ్యాధితోనూ ఇబ్బంది పడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. మెుగిలికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.