ప్రభాస్ కు తల్లిగా చేయమన్నా చేస్తాను: ‘బలగం’ ఫేమ్ రూపా లక్ష్మి

ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ‘బలగం’ సినిమా మాటే వినిపిస్తోంది. అంతగా ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుని పోయింది. పల్లె మనషులు తీరుతెన్నులు, వారి మాట తీరు, భావోద్వేగాలను దర్శకుడు వేణు తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. బలగం సినిమాను తన ఇంటి పేరుగా మలుచుకున్నాడు. అయితే, ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ ప్రేక్షకుల నుంచి ఎంతో ఆధరాభిమానాలు లభిస్తున్నాయి. యూట్యూబ్ తెరిస్తే బలగం నటుల ఇంటర్వ్యూలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెల్లి పాత్రలో నటించిన రూపా లక్ష్మి నటన సినిమాకి మరో హైలెట్ గా నిలిచింది. గతంలో నీదీ నాదీ ఒకే కథ, సరిలేరు నీకెవ్వరూ, జాంబి రెడ్డి వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఈమె ట్యాలెంట్ కు తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రూప మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను ఆరుగురు తోబుట్టువులు ఉన్న కుటుంబంలో జన్మించానని.. ఓ లెక్చరర్ తనను దత్తత తీసుకున్నట్టుగా తెలిపింది. అయినా అందరితో కలిసి ఉండటానికే ఇష్టపడుతుందట. ఇక భవిష్యత్తు పాత్రల గురించి వివరిస్తూ నటనకు ప్రాధాన్యమున్న ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమని తెలిపింది. చిన్న వయసులోనే తల్లి క్యారెక్టర్లు చేయడంపై మాట్లాడుతూ.. ‘‘అన్నింటికన్నా తల్లి స్థానం చాలా గొప్పది. 70 ఏళ్ల వ్యక్తికి తల్లిగా చేయమన్నా చేస్తాను. ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు తల్లిగా నటించమని అడిగినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు’’ అంటూ వివరించింది.