‘బలగం’ మొగిలయ్యకు ఆపదొచ్చింది

  • ‘బలగం’ మొగిలయ్యకు ఆపదొచ్చింది
  • ఆరోగ్య సమస్యలతో తిప్పలుపడుతున్న బుడగ జంగాల గాయకుడు 

వరంగల్‍/నర్సంపేట, వెలుగు :  ‘‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి..  నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా.. నీ జ్ఞాపకాలు మరవమయ్యో కొమురయ్యా..” అంటూ ‘బలగం’ సినిమా చివర్లో వచ్చే పాటను చూస్తూ, వింటుంటే కరగని మనసు ఉండదు.. కన్నీళ్లు పెట్టని మనిషీ ఉండడు. ఆ పాటను పాడుతూ,  నటించిన వరంగల్‍ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు ప్రేక్షకులతో హ్యాట్సాఫ్​ అనిపించుకున్నరు. కానీ, ఆ దంపతులు ప్రస్తుతం కన్నీళ్లతో సావాసం చేస్తున్నారు.

పుట్టెడు కష్టాలతో ఎదురీదుతున్నారు. మొగిలయ్యను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఆపన్న హస్తం కోసం ఆ దంపతులు  ఎదురుచూస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఈ దంపతులు బుర్రకథలు చెప్పుకుంటూ  పొట్ట పోసుకుంటున్నారు. మొగిలయ్యకు అనారోగ్యం కారణంగా నిజజీవితంలో కష్టాలు, కన్నీళ్లే  మిగిలాయి. కరోనా టైంలో ఆయన రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి.  దీంతో ఆయన రోజు తప్పించి రోజు డయాలసిస్ కోసం దవాఖాన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల మొగిలయ్యను మరో హెల్త్​ ప్రాబ్లమ్​ చుట్టుముట్టింది. బీపీ, షుగర్‍ పెరగడంతో.. ఆయన రెండు కండ్లపై ఎఫెక్ట్ పడింది.  

బెడ్​పై నుంచే ఫ్యాన్స్​కు రిప్లై.. 

మొగిలయ్య ఎప్పట్నుంచో బీపీ, షుగర్‍ తో  బాధపడుతున్నారు. అయితే ఆ ఎఫెక్ట్​ మిగతా అవయవాలపై పడింది. మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బలగం సినిమా కోసం చాలా రోజులు  పనిచేశారు. ఈ క్రమంలో ఒకరోజు ఆయన కండ్లు తిరిగి పడిపోయారు. చెయ్యి విరిగింది. హాస్పిటల్​ కు తీసుకెళ్లి చెక్​ చేయిస్తే.. కిడ్నీ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. టెస్టులు చేయిస్తే.. రెండు కిడ్నీలు ఫెయిలైనట్టు రిపోర్ట్​ వచ్చింది.  ఇంతకుముందు కరోనా సోకడం వల్లే మొగిలయ్య కిడ్నీలు దెబ్బతిన్నాయని డాక్టర్లు అన్నారు. ఇక డయాలసిస్ చేయించడం  కంపల్సరీ అని చెప్పారు. దీంతో అప్పటినుంచి వారానికి మూడు రోజులు హాస్పిటల్​ కు వెళ్లి డయాలసిస్​ చేయించుకుంటున్నారు.

ఈ క్రమంలో బీపీ, షుగర్‍లో హెచ్చుతగ్గుల కారణంగా కండ్లు మసకగా కనిపించేవి. అయితే 20 రోజుల కిందట మొగిలయ్య రెండు కండ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. మార్చి 3న బలగం మూవీ రిలీజ్‍  అయినప్పటి నుంచి మొగిలయ్య దంపతులు ఎవరు ? అనే దానిపై గూగుల్,​ యూట్యూబ్​లో సెర్చింగ్స్​పెరిగాయి. అడ్రస్‍  కనుక్కొని మరీ వారిని కలవాలని చాలామంది చూస్తున్నారు. కానీ మొగిలయ్య దంపతులు మాత్రం తమకొచ్చిన గుర్తింపును ఆస్వాదించలేని దుస్థితిలో ఉన్నారు. నిత్యం హాస్పిటళ్ల చుట్టూ తిరగడమే వారి పని అవుతున్నది. తమకొస్తున్న అభిమానుల ఫోన్లకు.. డయాలసిస్‍ బెడ్‍పై నుంచే మొగిలయ్య రిప్లై ఇస్తున్నారు.  

ఇంకా రూ.8 లక్షలు అవసరమైతై.. 

మొగిలయ్యకు డయాలసిస్‍ చేసే క్రమంలో రక్తం ఎక్కించేందుకు అవసరమైన ఆపరేషన్‍ పాయింట్‍ దొరకడం గగనమైంది. దీంతో డాక్టర్లు దాదాపు 11చోట్ల రంధ్రాలు చేయాల్సి వచ్చింది. చివరగా చెస్ట్ మీది నుంచి రక్తం ఎక్కిస్తున్నారు. డాక్టర్‍ మల్లేశం ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ ఉచితంగా చేస్తున్నా.. బాధితులు వారానికి మూడుసార్లు దుగ్గొండి నుంచి వరంగల్​ సంరక్ష హాస్పిటల్​ కు వచ్చిపోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. భార్య కొమురమ్మ అన్నీతానై బస్సులు, ఆటోల ద్వారా తన భర్తను ట్రీట్‍మెంట్‍ కోసం హాస్పిటళ్లు తిప్పుతున్నారు.

వరంగల్​ సిటీకి  వచ్చిపోవడానికి తోడూ మందులకు ప్రతినెలా రూ. 20 వేల దాకా ఖర్చు అవుతున్నది.  ఇప్పటికే రూ.14 లక్షలు ఖర్చు చేశామని మొగిలయ్య  భార్య కొమురమ్మ  ఏడుస్తూ చెప్పారు. నమ్ముకున్న కళ ద్వారా సంపాదించుకున్న రూ.8 లక్షలు ఇప్పటివరకు ఖర్చు చేశామని,  మరో రూ.6 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ మధ్య కాలంలో డయాలసిస్‍ చేయడానికి కూడా మొగిలయ్య శరీరం సహకరించడం లేదని డాక్టర్లు అంటున్నారు. మెరుగైన ట్రీట్‍మెంట్‍ కోసం రూ.3 లక్షలు అవసరమని చెప్తున్నారు.

ఇక కండ్లు మళ్లీ కనపడాలంటే రెండుసార్లు ఆపరేషన్‍ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు కావాల్సిన దాదాపు రూ.2 లక్షలు కూడా ప్రస్తుతం మొగిలయ్య దగ్గర లేవు.  బలగం డైరెక్టర్‍ వేణు కొంత సాయం చేసినా..  అన్ని రకాల ట్రీట్‍మెంట్‍, మందుల కోసం దాదాపు రూ.8 లక్షలు అవసరమవుతాయని  కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మనసున్న మారాజులు తమను ఆదుకోవాలని ఈ దంపతులు కోరుతున్నారు.