పిట్టె ముట్టింది : రఘు భువనగిరి

ఏమయ్య ఏణూ.. ఇదో శిన్మనా? అసలు శిన్మంటేందో, ఎట్ల తియ్యాల్నో, ఎవలను పెట్టాల్నో ఎర్కన నీకు? ఆ పల్లెటూరు.. సాంపి సల్లుడు, చెర్ల బర్ల కడుగుడు, పోరలు తానాలు జేసుడు, ఆడనే బట్టలు ఉత్కుడు, గల్లీల గొర్ల మందలు.. గివ్వా సూపిత్తే? అరే! గా పెంకుటిల్లు, ఇంట్ల ఏడియాడ సామాన్లు, టీవీ గూడ సక్కగలేదు, దోతులు కట్టుకునే ముసలోళ్లు, లుంగీల మీద తిరిగే కాకలు, గాళ్లావయా.. యాక్టర్లు? గిట్లయితే మా కళామ తల్లి ముదురు ముద్దు బిడ్డెలేంగావాలె? ఓ 20 కోట్లిస్తే మావోళ్లు యాక్టింగ్ జెయ్యరా? ఈరో పేరు సాయిలేందివయా.. సాయిలు. మంచిగ శానిగుండాలె. ఆ సాయిలుగానికి ఏమన్న దిమాకుందా అస్సలు? అయ్యవ్వ సూశిన పొల్లను ఖాయం జేస్కుంటాడు? ఆ పొల్లెట్లుంది లడ్డు లడ్డుకె. నున్నగ సన్నగుండాలె. ఈరోయిన్ను గీ పొల్లను పెడుతావ్? మంచిగ బొంబాయికెల్లి పట్కొస్తేమాయే, పోతేవాయే ఓ 5 కోట్లో.. 10 కోట్లో, సంధ్య పేరు గూడ మంచిగలే. నోరు తిరుగని శాని పేరు పెట్టాలె. నీకసలు ప్రేక్షకులు ఏం కోర్కుంటరో ఎర్కన? ఇరోయిన్ను సూపిచ్చే తరీఖా గిదేనా? మొత్తం పంజాబీ డిరెసే తొడుగుడేంది? ఒక్కపారన్న మిడ్డిలనో, చెడ్డిలనో సూపియ్యాలనే సోయేలేదు.. నువ్వేం డైరెక్టరువయా? ఆ.. గిట్లయతే.. మా ఊత్ పోరలను ఏంజెద్దామన్కుంటున్నవ్? 

పబ్లికంత బూకరోళ్లా.. ఎన్నడు తున్కలు తిననోళ్లా?

ఆ రాజేష్ ​గానికేం పనిపాట లేనట్టుంది. దోస్తుగానోల్ల తాత సస్తే మొత్తం పనులు ఆడే సగవెడ్తడు. అరే.. మందు తాపాలంటే మాంచి పబ్బుకు తీస్కపోవాలె.. మస్కమస్క లైట్ల కింద చెంగడం బింగడం ఎగురాలె. అంతేగని.. ఆకిట్ల మంచమేశి.. అందర్ని కూకుండవెట్టి మందు తాపుడేందివయా.. చిల్లర ఏశాలు గాకుంటే. గా ఆరెంపీ డాక్టర్ సుత అసొంటొడే.. మంచి దవ్కాన్ల సూదులు గుచ్చుకుంట పైకం కమాయించక. భోజనాల కాడ ఓ కాక మొత్తం ముక్కలకే దేవులాడ్తడు. అంటే పబ్లికంత బూకరోళ్లా? ఎన్నడు తున్కలు తిననోళ్లా. మేం ఏడికన్నవోతే.. అస్సలు శియ్యల దిక్కు సూడం. ఇంత దప్పుడం తాగి సప్పుడుగాకుంటొస్తం. గా ఒగ్గు కథలేంది ఆళ్లకు పైసలు సదివిచ్చుడేంది.. మాకేం నచ్చకపాయే. మంచిగ సన్నిలియోన్ను పెట్టి డియ్యో డియ్యో డిసక డిసక డ్యాన్స్ ఆడిస్తే...నోట్లు సల్లుకుంట సొల్లు కార్సుకుంట సంబురవడ్దుం. చీపుగా ఊర్ల గట్లపొంట, చెట్ల పొంట్ల పాటలు పాడుడేంది... మంచి బైటిదేశాలకువొయ్యి బర్పు గడ్డల మీద తైతక్కలాడితే మాకు జెర శిన్మ లెక్క అన్పిస్తది. ఔనయ ఏణూ.. జబర్ధస్తుల నీ డబుల్ మీనింగ్ డైలాగులు మస్తుండుంటే. మరి గీ శిన్మలేందే ఒక్కటన్న లేకపాయే. సచ్చంగా చెప్తున్న.. టీవీల జిగేల్ రాణి పాటలొస్తుంటే..ఇంటామె ఒంటర్రలకు నేను బైటికి.. పోరలు ఫోన్ల తల్కాయ పెట్టేటోళ్లం. నీ శిన్మకిన వారెత్తు.. మా అవ్వ, మా అయ్య, నేను, మా పెండ్లాం, పోరడు, మా బుజ్జి...అందరు కల్శి గీ శిన్మ సూశేతట్టు జేశిపాడైతివి. చీకటివడంగనే ఎవ్వలింట్ల ఆళ్లం తల్పులు పెట్కోని.. సీరియల్లు సూద్దుం నిమ్మలంగా. గీ శిన్మ జెయ్య వట్టికే.. మా ఆడకట్టోళ్లంత ఒక్కకాడికి చేరి..పెద్ద టీవీల శిన్మేస్కోని సూశేతట్టు జేస్తివి. ఎన్కట ఓసేయ్​ రాములమ్మ శీన్మకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు కట్కోని టాకీసుకు ఒయ్యేటోళ్లం. నీ శీన్మజెయ్యవట్టికే మల్ల.. గా రోజులొచ్చేతట్టున్నయి.

నల్లిబొక్క కోసానికి అలుగుడా..

అరే.. అద్దకిల కూర దెచ్చి.. అండ్లొక్కటే నల్లిబొక్కొస్తే.. అది పెన్మిటికి గాకుంట అన్నకేస్తాదే.. ఆ లచ్చిమికి ఎంత ధైర్నం? గా నల్లిబొక్క కోసానికి ఇంటల్లుడు అలుగుడేందే? మా ఇండ్లల్ల యాట పోతులు కోశివెడ్తం బావలకు. ఆ నారి బావకు జెర్రంతన్న ఇజ్జత్ లేదు. బంతిలకెల్లి బామ్మర్దులు లేశివోయినా... బొక్కలు కంకేదానికి.. ఆల్లొచ్చేదాకా ఎదిరిసూస్తడేంది మార్యాదక్వ మనిషిగాకుంటే. ఆ లచ్చవ్వది గిన తప్పే. అన్నలకు, పెన్మిటికి కీసులాటైతే..పెన్మిటిని ఇడ్శిపెట్టి అమ్మగారింట్లుండాలేగని.. మొగన్నివట్కోని ఎట్ల వోతది?  అన్నలకంటే మొగడే ఎక్కువైనాడు ఆమెకు..? నన్నడిగితే కని పెంచిన నాయ్న ఆఖరి సూపుకు సుత వొచ్చేదే లేకుండే లచ్చవ్వ. ఐనా సాయిలుగాడేం జేస్తుండే అత్తగారింటిది తొవ్వేది? అని లచ్చవ్వింట్ల కారు డైవర్గనో, టాక్టరు డైవర్గనో చెరిగ్గాక. అత్త బిడ్డెను శిడాయించుడు శాతగాదు ఆడేం ఈరో. ఆమె తానం జేస్తుంటే ఈరోను బాత్రూంలకు పంపే సీన్ పెట్టకవోతివి. కొమురయ్య చిన్న కొడుకు 
మొలిగిలయ్య ఉత్త వేస్ట్ గాడహే. బత్కనీకి సూరత్కువోతాడే మంచిగ అమ్రికో, ఆస్ట్రేలియో చెక్కెయ్యాలె.. ఆడ పెద్ద సావుకారి కావాలే. ఎన్ని శిన్మలల్ల సూత్తలేం. ముత్తెమంత జాగ కాడ అన్నదమ్ముళ్లు పంచాది పెట్కునుడు మాకైతే నచ్చలె. అరే.. వెయ్యిల కోట్లు..పెద్దపెద్ద కంపిన్లు.. వాటాల కాడ పంచాది పెడితే శిన్మ సూశినట్టు అన్పిస్తది. అంతేగని మాలెక్కనే ఆళ్లను సూపిస్తే సూడబుద్ధిగాకవాయే. భూమమ్మి ఇల్లు కట్టుకుంటం అనుడు సుత చిన్నకోడలిది తప్పే. గట్లనే కిరాయి కొంపలల్ల సస్తం..చేశిన కష్టమంత ఓనర్లకు పెడ్తం అనాలె.. ఇద్దరు ఆడివిల్లలు పెద్దగైతుండ్రు ఇంత ఇల్లన్న ఉండొద్దాని ఆశ వడితెట్లా? ఉత్త గయ్యాలిదున్నట్టుందొసు.

గిప్పగిప్ప డీజేలు గొట్టాలి.. బాలి బాలేంది?

ఔనయా.. పిట్టె ముట్టుండేందయ్యా పిట్టె ముట్టుడు. సచ్చినాయినె ఆత్మ కాకిల సొర్రి కమ్మటి బువ్వ తింటానికొస్తాడు.. ఉత్త ఎడ్డి నమ్మకం గాకుంటే. మీ అసొంటొళ్లతోనేనయా సైన్సు సచ్చిపీక్తుంది. మావోడు తీశిన అమ్మోరు శిన్మ టాకీస్ల సూస్తుంటే సీట్ల కూకున్న అమ్మలక్కలు శిగాలూగిండ్రు. టాకీస్ ముంగట అమ్మోరు బొమ్మ నిలవడితే కొబ్బరికాయలు కొట్టి జాతర జేస్కుండ్రు. గది నమ్మకమంటే.. మురారి, అంజి, దేవుళ్లు అసొంటి శిన్మలు సైన్సును రాకిట్ మీదెక్కిచ్చుకోని మొగులు మీద్కి తీస్కవాయే. ఏంది..? పిట్టె ముట్టకుంటే ఊర్లకెల్లి వెలేస్తరు? గింత అన్యాలం ఉంటదా? అంటే అట్ల బెదిరిచ్చి ఇంటోల్లందర్ని కల్పుదామనే.. మస్త్ ఉషారున్నవ్ పో. గిదేందివయో.. మీ తెలంగాణ శిన్మ గావట్టి నచ్చకుంటే మాట్లాడొద్దా? రాయలసీమ శిన్మలు సూస్తలేవ్. మా బాలి కాక తొడగొట్టి ఏలు సూపిస్తే రైలు ఎన్కకు ఉర్కుతది రోషమంటే గది. గుద్దుడు గుద్దితే నలుగురు గుండెగాళ్లు గాల్లె గిర్కలు కొట్కుంట నెత్తూరుకక్కి సస్తరు. రౌడీలంటే ఎట్లుండాలే.. ఎన్నడు తానాలు జెయ్యోద్దు.. నల్లగ మశి వూస్కోని..మర్రూడల్లెక్క నెత్తులు పెంచుకొని జెంగువట్టిన పండ్లుంటనే రౌడీలు. ఆళ్ల నడ్మ తెల్లటి బట్టలతోటి.. చెక్కున మెరిశే ఈరో. గిట్ల తీస్తే మా ఇంకింత మనోభావాలు గట్టిగైతయ్. తాటి చెట్లకు తాళ్లు గట్టి కిందికి వొంచి.. మీదికిడిస్తే మన్సులు ఎగిరి ఔతలవడ్తరు. సక్కటి సందమామ కథకు గ్రాఫిక్స్ శిన్మ చెక్కిన జక్కన కాడ ట్రేనింగ్ తీస్కునేదుంటివి. కాకి తప్ప గ్రాఫిక్ బొమ్మే అగువడలే శిన్మ మొత్తంల. అవ్వో పాటలా? బాలి.. బాలి బాలి.. బాలెందయ్యా బాలి. బలరామ నర్సయ్యో...అసలది పాట లెక్కుందా? శృతులేవి.. రాగాలేవి? అర్థంగాని పదాలు రాశి.. గిప్పగిప్ప డీజేలు గొట్టి తెల్గు సంగీతాన్ని ఏడికో తీస్కపోవాలన్కుంటే.. మీరేమో మా జీవితాలు, మా బాధలు అన్బవాలు అన్కుంట మీ భాషల రాస్కుంటరు. గట్ల బుడగ జంగాలతోటి పాట పాడిచ్చుడేందివయా? ఇండ్లపొంట అడుక్కునే కళాకారుల తోటి శిన్మల పాడిస్తే ఇగ మా గాన గబ్బిలాలు ఏంగావాలె? సరే..సరే.. తీయ్ పాటవడిన మొగిలియ్య కాకకు పానం బాగలేకుంటే మనిషిన్ని పైసలు పంపుతుర్రట శిన్మ సూశి. సరేగని కొమురయ్య ఇంటోళ్లు గుండ్లెందుకు కొట్టిచ్చుకోలే? గిదేనా మన పద్ధతి? పిట్టె ముట్టంగనే శుభం కారట్ ఎయ్యకుంట గుండ్లు కొట్టిచ్చుకునేదాకా సాగదీస్తే నీ ముల్లేమన్నపోయినాదయా? తెలంగాణ ఈరోను గుండుతోటి సూపిస్తే జెర మా కండ్లు సల్లవడుగ. పెండ్లిలు, ప్రేమల సుట్టు శిన్మలు నడ్పుతరుగని.. గిట్ల సావు సుట్టు తిప్పుడే గమ్మతుందివయా. ఏహే శిన్మ సూశిన ఫీలింగే లేదబ్బ..సుట్టపాయినే కాలం జేస్తే సావుకువొయ్యి దినాలదాకా ఆడనే ఉన్నట్టుంది.  కని ఏ మాటకు ఆ మాట వందల కోట్లు పెట్టి తీస్తనే శీన్మ.. తోపు  ఈరో ఉంటెనే శీన్మ.. నడ్మిట్ల ఐటమ్​ సాంగ్​ ఉంటెనే సూత్తరు.. ఈరోయిన్​ బట్టలెక్కువ ఏస్కుంటే సూడరు... రౌడీ, గుండెగాళ్లు బగ్గుండాలె.. అని గాయి గత్తర శీన్మలు తీశేపోళ్ల గుండ్లు కొట్టినంత పన్జేశినవ్​ పో.

–  రఘు భువనగిరి