అన్నపురెడ్డిపల్లి/జూలూరుపాడు/ములకలపల్లి/అశ్వాపురం/ఇల్లెందు, వెలుగు: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో బాలాజీ వేంకటేశుడి కల్యాణం సోమవారం వైభవోపేతంగా జరిగింది. ఉదయం నుంచే స్వామి వారికి సుప్రభాత సేవ, ఆరాధన, నివేదన, అభిషేకాలు, అర్చనలు, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణానికి అవసరమైన పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాల బియ్యం కలిపారు. సాయంత్రం స్వామికి గజ వాహన సేవ, అమ్మవారికి ఎదుర్కోలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
స్వామి కల్యాణాన్ని రాత్రి10 గంటలకు యజ్ఞాచార్యులు ప్రతాపురం గిరాధరాచార్యులు ఘనంగా చేశారు. అశ్వాపురం మండల పరిధిలోని నెల్లిపాక సమీపంలో బండ్లసరిగుట్టపై వేంకటేశ్వర స్వామి కల్యాణ వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆయనకు ఆలయ పూజారులు స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించారు. జూలూరుపాడు మండలంలోని కాకర్ల పాలగుట్ట శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కల్యాణం ఘనంగా జరిగింది.
ములకలపల్లి మండలంలోని మూకమామిడిలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో పాల్వంచకు చెందిన పూజారి నగేశ్ శర్మ ఆధ్వర్యంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఇల్లెందు మండలంలోని కోమరారంలో రాధాకృష్ణల కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు.