కాకా ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఊరుకోం

కాకా ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఊరుకోం
  • మందకృష్ణ మాదిగ నోరు అదుపులో పెట్టుకోవాలి
  • తెలంగాణ మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బాలకిషన్ 

ముషీరాబాద్, వెలుగు: దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి గురించి మాట్లాడే అర్హత మందకృష్ణ మాదిగకు లేదని తెలంగాణ మాలల ఐక్యవేదిక అధ్యక్షులు బేర బాలకిషన్ అన్నారు. జీవితాంతం కాకా ప్రజల పక్షాన పోరాడారని గుర్తుచేశారు. అలాంటి కాకా కుటుంబం గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.కాకా వెంకటస్వామి లేకుంటే మాలలు, మాదిగలు పరిస్థితి ఏమయ్యేదో ఓసారి గుర్తుచేసుకోవాలని సూచించారు. మందకృష్ణకు రాజకీయ జన్మ ఇచ్చిందే మాలలు అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయొద్దని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మాల అడ్వకేట్స్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్​లో ‘మాల సింహగర్జన’ పేరుతో నిరసన దీక్ష చేపట్టారు.

మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, బేర బాలకిషన్, మంబా అశోక్ కుమార్, చంద్రశేఖర్, పి.అశోక్ కుమార్, మంచాల వెంకటస్వామి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ  వర్గీకరణ చేయొద్దని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లను 30 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. 30 ఏండ్లుగా మాలలకు విద్య, ఉద్యోగ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణతో రిజర్వేషన్లు తొలగించే కుట్ర చేస్తున్నాయని  ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21న నిర్వహిస్తున్న భారత్ బంద్ కు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు దీక్షలో మేధావులు, ప్రొఫెసర్లు, మాల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.