- యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్పై దృష్టి పెడ్తం
- హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) అమలు ముఖ్యమైన చాలెంజ్ గా మారిందని.. అయినా, దాన్ని అమలు చేస్తామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొత్త చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో దశలవారీగా న్యూ ఎన్ఈపీని ఇంప్లిమెంట్ చేస్తామని, దీంట్లోని మంచిని స్వీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. వర్సిటీలకు ఫండ్స్ కావాలంటే యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో కావాల్సిందేనన్నారు. గురువారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో కౌన్సిల్ చైర్మన్గా బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్గా ఇటిక్యాల పురుషోత్తం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ చైర్మన్గా కొనసాగిన ప్రొఫెసర్ లింబాద్రిని, వైస్ చైర్మన్గా కొనసాగిన వెంకటరమణను వారు సన్మానించారు.
అనంతరం బాలకిష్టారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తమపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామన్నారు. టెక్నాలజీకి తగ్గట్టు విద్యావ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. నల్సార్ వర్సిటీలో ఎన్నో కొత్త కోర్సులను అందుబాటులో తీసుకొచ్చామని.. డిగ్రీ, పీజీలోనూ అలాంటి కోర్సులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. హయ్యర్ ఎడ్యుకేషనలోనూ సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరని, వసతులు లేవన్నారు. వర్సిటీలోని ఖాళీల భర్తీపై దృష్టిపెడతామన్నారు. కాంట్రాక్టు టీచర్లకు కమిట్ మెంట్ ఉండదని ఆయన పేర్కొన్నారు.