
స్టార్ హీరోల పుట్టినరోజు అంటే అభిమానులకు అది పండుగ రోజు. ఇక బాలకృష్ణ లాంటి మాస్ హీరో బర్త్ డే వస్తోందంటే ఆయన కొత్త చిత్రాల అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో తెలిసిందే. జూన్ 10న ఆయన పుట్టినరోజు కాగా ఈసారి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు బాలయ్య.
ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న‘అఖండ 2’చిత్రంలో ఆయన నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ‘అఖండ’బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో సీక్వెల్‌పై ఉండే అంచనాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో బోయపాటి దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
బాలయ్య బర్త్ డే సందర్భంగా స్పెషల్ టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. టీజర్‌కు సంబంధించిన సీన్స్‌ను ఇప్పటికే షూట్ చేయగా, అందుకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోంది.
ఇదిలా ఉంటే ‘వీరసింహా రెడ్డి’లాంటి మాస్ ఎంటర్‌టైనర్ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలకృష్ణ నటించబోతున్నారు. రామ్ చరణ్‌తో ‘పెద్ది’చిత్రాన్ని నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా బాలయ్య బర్త్ డేకు రాబోతోంది. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నప్పటికీ ఈ రెండు చిత్రాల అప్‌డేట్స్ మాత్రం కచ్చితంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.