మరోసారి ఆదిత్య 369 టైమ్‌‌‌‌ మెషిన్‌

మరోసారి ఆదిత్య 369 టైమ్‌‌‌‌ మెషిన్‌

బాలకృష్ణ  నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి ‘ఆదిత్య 369’. టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్‌‌‌‌గా రూపొందించిన ఈ సినిమా విడుదలై  ముప్ఫై నాలుగేళ్లు అయినా ఇప్పటికీ దీనిపై స్పెషల్ క్రేజ్ ఉంది. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న 4కె క్వాలిటీతో డిజిటలైజ్ చేసి  రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.  సీనియర్ డైరెక్టర్  సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన  ఈ సినిమాను  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించింది. రీ రిలీజ్ సందర్భంగా నిర్మాత  శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఆరు నెలలుగా వర్క్ చేసి, మంచి క్వాలిటీతో అవుట్‌‌‌‌పుట్ సిద్ధం చేశాం. 

అప్పట్లో ఇది చాలా అడ్వాన్స్ సినిమా. ఇప్పటి ట్రెండ్‌‌‌‌కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా. చిత్ర నిర్మాణంలో నాకెంతో సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి జీవితాంతం రుణపడి ఉంటాను.  ఇంత గొప్ప ప్రాజెక్టు నాకు ఇచ్చి నిర్మాతగా నన్ను ఎన్నో మెట్లు ఎక్కించిన బాలకృష్ణ గారికి, సింగీతం గారికి రీ రిలీజ్ గురించి చెబితే చాలా ఎక్సయిట్ అయ్యారు. 

ఇందులో బాలయ్య బాబు  రెండు పాత్రల్లోనూ  అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన నటనలో రాజసం ఉట్టిపడుతుంది. ఈ చిత్రాన్ని టీవీల్లో  ఎన్నిసార్లు చూసినా,  వెండితెరపై చూస్తే వచ్చే అనుభూతి, మ్యాజిక్ వేరు. మరోసారి ప్రేక్షకాదరణ పొంది బాలయ్య బాబు హిట్ హిస్టరీని రిపీట్ చేస్తుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు.