Daaku Maharaj Real story: బాలకృష్ణ సినిమాలో డాకు మహారాజ్ ఎవరు.​? ఆయన స్టోరీ వింటే షాక్ అవ్వాలసిందే.

Daaku Maharaj Real story: బాలకృష్ణ సినిమాలో డాకు మహారాజ్ ఎవరు.​? ఆయన స్టోరీ వింటే షాక్ అవ్వాలసిందే.

Daaku Maharaj Real story: టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తుండగా సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ ఇటీవలే అయ్యింది. దీంతో నెటిజన్లు ఈ సినిమా టైటిల్ లోని డాకు మహారాజ్ గురించి తెగ వెతుకుతున్నారు. 

డాకు మాన్​ సింగ్.. పోలీసులకు నేరస్తుడు... కొన్ని ఊళ్లకు దేవుడు. ఎంతోమందికి మేలు చేసిన గొప్ప నాయకుడు. ఈ సినిమాని మాన్ ​సింగ్ స్టోరీ ఇన్​స్పిరేషన్​తోనే తీశారట! లెక్కలేనన్ని దోపిడీలు చేసిన అతన్ని దేవుడిలా ఎందుకు కొలుస్తున్నారు? అతను ఎక్కడివాడు? 

మాన్​ సింగ్​ 1890లో ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేరా రాథోడ్ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో పుట్టాడు. ఎక్కువగా ఛంబల్ ఏరియాలో పెరిగాడు.17 మంది సహచరులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత తన అనుచరుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అతనికోసం పరోక్షంగా, ప్రత్యక్షంగా 400 మందికి పైగా పనిచేసేవాళ్లు. అతని మీద185 హత్యలు,1,112 దోపిడీ కేసులు ఉన్నాయి.  లెక్కలేనన్ని కిడ్నాప్‌లు చేశాడు. అంతెందుకు 32 మంది పోలీసులను చంపాడు. నాలుగు రాష్ట్రాలకు చెందిన వందల మంది పోలీసులు15 సంవత్సరాల పాటు అతనికోసం వెతికారు. అయితే.. ఇదంతా నాణేని​కి ఒకవైపే. మరోవైపుచూస్తే.. అతను నిజంగానే రాజ్యం లేని రాజు. కొన్నివేల మంది అతన్ని దేవుడిలా కొలుస్తున్నారు. 

జైలుకు పంపడంతో.. 

మాన్​సింగ్​కి చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండేవి. పెద్దయ్యాక ఊరిలో చిన్న చిన్న పంచాయితీలకు తీర్పులు చెప్పేవాడు. అతని ఎదుగుదల అక్కడి కొందరు రౌడీలు, వడ్డీ వ్యాపారులకు నచ్చలేదు. దాంతో అతనిపై కుట్రలు చేయడం మొదలుపెట్టారు. అతని భూమిని అన్యాయంగా లాక్కున్నారు. తర్వాత తప్పుడు కేసు పెట్టి, జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలయ్యాక కోపంతో తను జైలుకు వెళ్లడానికి కారణమైనవాళ్లపై దాడి చేశాడు. వాళ్ల ఇళ్లకు నిప్పుపెట్టాడు. ఆ తర్వాత ఛంబల్​ లోయల్లోకి వెళ్లిపోయాడు. కానీ.. కొన్నాళ్లకు అక్కడి నుంచి తిరిగి ఊరికి వచ్చారు. వెంటనే పోలీసులు అరెస్ట్​ చేశారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మాన్ సింగ్​ను మళ్లీ జైలుకు  పంపింది. జైలులో ఉన్నప్పుడే అతని ఇద్దరు కొడుకులు జస్వంత్ సింగ్, ధన్వన్ సింగ్‌ని ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. మాన్ సింగ్1939లో జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పటినుంచి ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. కొడుకులను చంపినవాళ్ల మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. 

గుడి కట్టారు.

మాన్ సింగ్ దోపిడీలు చేసిన మాట వాస్తమే. కానీ.. అలా సంపాదించిన డబ్బుని ఎక్కువగా మంచి పనుల కోసమే ఖర్చు చేసేవాడు. ధనికుల ఇళ్లను దోచి.. పేదల జేబులు నింపేవాడు. ఆడవాళ్లను గౌరవించేవాడు. చాలామంది అమ్మాయిలకు పెళ్లిళ్లు కూడా చేశాడు. అందుకే ఆగ్రా చుట్టుపక్కల జిల్లాల్లోని చాలా గ్రామాల్లో  మాన్ సింగ్‌ను దేవుడిగా గౌరవిస్తారు. అంతెందుకు అతనికి గుడి కూడా కట్టారు. ఆ ఆలయం ఇప్పటికీ ఉంది. 

అమితాబ్ బచ్చన్ కూడా..

అమితాబ్ బచ్చన్ కూడా ఒక బ్లాగ్​లో డాకు సింగ్ గురించి ప్రస్తావించారు. ‘నా చిన్నప్పుడు డాకు మాన్ సింగ్ సాహసాల గురించి ఎన్నో కథలు విన్నాం. నలుగురు ఒకచోట కలిస్తే.. కచ్చితంగా మాన్​ సింగ్ ప్రస్తావన వచ్చేది’’ అంటూ చెప్పుకొచ్చాడు. మాన్​సింగ్​ జీవిత కథతో బాబుబాయ్ మిస్త్రీ డైరెక్షన్‌లో1971లో ‘డాకు మాన్ సింగ్’ అనే సినిమా కూడా వచ్చింది. 2019లో వచ్చిన ‘సోంచిరియా’ మూవీలో కూడా మాన్​సింగ్​ ఇన్​స్పిరేషన్​తో కొన్ని సీన్లు పెట్టారు. అతని పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ నటించాడు.