నేడు విజయవాడలో జరగనున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమానికి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. చెన్నై నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకి బయల్దేరిన ఆయన.. కొద్దిసేపటి క్రితమే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ రజినీకాంత్ కి.. నందమూరి బాలకృష్ణ సాదర స్వాగతం పలికారు.
అనుమోలు గార్డెన్స్‌లో జరగనున్న ఈ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. మొత్తం 100 ప్రాంతాల్లో 100 వేడుకలు నిర్వహించేలా ప్రణాళిక చేసింది తెలుగు దేశం పార్టీ. ఇందులో భాగంగా.. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై రెండు పుస్తకాలను ఈరోజు విడుదల చేయనున్నారు. మొత్తం 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.
ఇక ఈ వేడుకలకు.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సహా పలువురు నేతలు హాజరుకానున్నారు.