తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు నందమూరి బాలకృష్ణ. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వెళ్లిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక చేసిన అనంతరం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానంటూ ఎన్టీఆర్ ముందుకొచ్చారని బాలకృష్ణ తెలిపారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారని చెప్పారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న ఆయన..నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన్ని స్పూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని..అయితే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారని అన్నారు.
కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. అదేవిధంగా తెనాలిలో ని పెమ్మసాని థియేటర్ లో ఏడాది పాటు ప్రదర్శించే ఎన్టీఆర్ సినిమాలను బాలకృష్ణ ప్రారంభించనున్నారు.