ఎన్టీఆర్కు బాలకృష్ణ నివాళి

ఎన్టీఆర్ పొలిటికల్ హీరో అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజల కోసం ఎంతో సాహసోపేతమైన పథకాలు తెచ్చారని బాలయ్య గుర్తు చేశారు. పేదవాడి ఆకలి తీర్చిన అమ్మ, ఆడవారికి అండగా నిలిచిన అన్న ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. ఆ తల్లితండ్రులకు బిడ్డగా జన్మించడం తన అదృష్టమన్నారు. ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ట నివాళులర్పించారు.

టీడీపీ అనేది రాజకీయ పార్టీ కాదు.. ఒక వ్యవస్థ అని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ అన్ని వర్గాల వారిని సమానంగా, సగౌరవంగా ఆదరించారని తెలిపారు. ఎన్నో ఆటుపోటులను చూసినా.. ఎన్టీఆర్ ఎప్పుడూ తల వంచలేదని చెప్పారు. ఎన్టీఆర్ సామాన్య  రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నట ధీరుడు కనిపించడని అన్నారు. నటనలో ప్రతీ పాత్రకు ఆయన జీవం పోశారని చెప్పారు. ఎన్టీఆర్ ప్రతీ తెలుగు బిడ్డకు ఆత్మవిశ్వాసం కల్పించారని..ఎంతో మందికి  రాజకీయ ఓనమాలు నేర్పారని తెలిపారు.