కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో ‘డాకు మహారాజ్’ ఒకటని బాలకృష్ణ అన్నారు. బాబీ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌ను అందుకుంది.
ఈసందర్భంగా అనంతపురంలో నిర్వహించిన విజయోత్సవ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్ చేస్తుంటాము. దీనికి కూడా ఎంతో రీసెర్చ్ చేశాం.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. నా వరుస చిత్రాలు ప్రేక్షకులకు నచ్చడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉండేలా చేశాయి. నేను సినిమా కలెక్షన్స్ గురించి పట్టించుకోను. నా అవార్డ్స్, రివార్డ్స్, రికార్డ్స్, కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని అందరికీ తెలుసు’ అని అన్నారు.
ఈ సక్సెస్ తమకు మరింత ఎనర్జీని ఇచ్చిందని హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా అన్నారు. భవిష్యత్‌లో బాలకృష్ణ గారితో ‘డాకు మహారాజ్’ని మించిన గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నా అన్నాడు డైరెక్టర్ బాబీ. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.