అభిమానులు కోరుకునేలా డాకు మహారాజ్ : బాలకృష్ణ

బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందించిన  చిత్రం ‘డాకు మహారాజ్’.  శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్స్.  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన  ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. దీంతో  అనంతపురంలో జరగాల్సిన ఈవెంట్‌‌ను రద్దు చేశాం.

 నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే వారు మా నిర్ణయాన్ని స్వాగతించారు.  ‘ఆదిత్య 369’లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ఈ  కథ పుట్టింది.  నా నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టుగా సినిమా ఉంటుంది.  అందరూ ఏం ఊహించుకుంటున్నారో అంతకంటే మించేలా ఈ సినిమా ఉంటుంది.  మూడు వరుస  విజయాల తర్వాత వస్తున్న ఈ సినిమాతో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకముంది’ అని చెప్పారు.

ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించామన్నారు హీరోయిన్స్.  ‘బాలకృష్ణ గారితో కలిసి పని చేస్తే ఆయనను ప్రేమిస్తాం, అభిమానిస్తాం. ఆయనతో మళ్ళీ మళ్ళీ కలిసి పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది’ అన్నాడు దర్శకుడు బాబీ.  నాగవంశీ మాట్లాడుతూ ‘ఐదేళ్ల క్రితం వైకుంఠ ఏకాదశి రోజున 'అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం. ఆ సినిమా జనవరి 12 ఆదివారం విడుదలైంది. ఈ సినిమా విషయంలోనూ అలా జరగడంతో కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, బాలకృష్ణ కూతురు తేజస్విని, అల్లుడు భరత్ తదితరులు పాల్గొన్నారు.