72 గంటలు టైం ఇస్తున్నా.. బాలకృష్ణ, విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయండి: కేఏ పాల్

72 గంటలు టైం ఇస్తున్నా.. బాలకృష్ణ, విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయండి: కేఏ పాల్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. డబ్బులకు ఆశపడి నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన పలువురు యూట్యూబర్లు, ఇన్‎ఫ్లూయెన్సర్లు, సినీ సెలబ్రెటీలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హీరో విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, మంచు లక్ష్మీ, విష్ణు ప్రియ, యాంకర్ శ్యామల, సుప్రియ, రీతు చౌదరి, టెస్టీ తేజ,  భయ్యా సన్నీ యాదవ్ వంటి పలువురిపై కేసులు ఫైల్ చేశారు.

ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. 72 గంటలు టైం ఇస్తున్నా.. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్ట్ చేయాలని డెడ్ లైన్ విధించారు. అలా కాకుండా పోలీసులు, పొలిటిషియన్స్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని అరెస్ట్ చేయకపోతే.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరిని నేనే సుప్రీంకోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. నటుడు ప్రకాష్ రాజ్ లాగా తప్పు అయిందని మిగిలిన సెలబ్రెటీలు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచించారు.

ALSO READ | ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను..ముగిసిన నటి శ్యామల విచారణ

 అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా సంపాందించిన డబ్బులను బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ మీద ఉన్న అభిమానంతో ఫ్యాన్స్ మీరు చెప్పింది వింటున్నారు.. అలాంటివారిని మీరు డబ్బుల కోసం మోసం చేసి ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నారు.. కనీస మానవత్వం లేదని కడిగిపారేశారు కేఏ పాల్. అభిమానులు ఆత్మహత్యలతో డబ్బు సంపాదిస్తే ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆత్మ శాంతి ఉంటుందా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే భవిష్యత్‎లో  చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.