
హైదరాబాద్ బాలానగర్ చలానా మృతి కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో మృతుడి వివరాలు వెల్లడించారు పోలీసులు. మృతుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు అలియాస్ బాబ్జీ గా గుర్తించారు. హైదరాబాద్ లో కార్పెంటర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జోష్ బాబు బాలానగర్ రోడ్డుపై అదుపుతప్పి పడిపోయి.. బస్సు కింద పడి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మృతుడి కుటుంబ సభ్యులు బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి తమ బ్రదర్ జోష్ బాబు మృతి చెందాడని మృతుని సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపారని చెప్పారు. బైక్ ముందుకు వెళుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని లాగాడని, ఆ సమయంలో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్ మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. చొక్కా పట్టుకుని లాగడం వలననే అదుపుతప్పి జోష్ బాబు అలియాస్ బాబ్జీ బస్సు చక్రాల కింద పడి చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
►ALSO READ | హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. చలానా కోసం బైక్ను ఆపిన ట్రాఫిక్ పోలీస్.. బస్సు కింద పడి వ్యక్తి మృతి
తమ సోదరుడి తలపై నుండి ఆర్టీసీ బస్సు వెళ్ళిందని, ఘటన స్థలంలోనే మృతి చెందాడని చెప్పారు. జోష్ బాబు వివాహమై ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. జోష్ బాబు కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతాం: పోలీసులు
బాలానగర్ మృతి ఘటనపై నిస్పక్షపాతంగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. DPL చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తున్నారని, ఆ సమయంలో
జోష్ బాబు బండి పై వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదంపై మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని.. అన్ని కేసు లాగే ఈ కేసును కూడా విచారిస్తామని చెప్పారు.
కానిస్టేబుల్ నిర్లక్ష్యం ఉంటే కచ్చితంగా అక్కడ దొరికిన ఆధారాలతో చర్యలు తీసుకుంటామని బాలానగర్ పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ తాగి ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో.. ట్రాఫిక్ కానిస్టేబుల్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తామని అన్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్ ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.