బాలానగర్, వెలుగు : గోవా నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న లిక్కర్‌ను మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కొందరు వ్యక్తులు లారీ కంటైనర్‌లో సగం వరకు లిక్కర్ కాటన్లను నింపి, వాటిపై ఎరువుల బస్తాలు వేసి గోవా నుంచి ఏపీలోని రాజమండ్రికి తీసుకెళ్తున్నారు. విషయం తెలుసుకున్న అడ్డాకుల పోలీసులు వెంటనే బాలానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఎస్సై త్రిపాజి శనివారం తెల్లవారుజామున బాలానగర్‌లోని ఎన్‌హెచ్ 44పై వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ టైంలో అటుగా వచ్చిన ఓ కంటెయినర్‌ను ఆపి తనిఖీ చేశారు. పైన ఉన్న ఎరువుల బస్తాలను తీసి చూడగా రెండు వేల కాటన్ల లిక్కర్ దొరికింది. పట్టుబడిన లిక్కర్ విలువ సుమారు రూ. 2.07 కోట్లు ఉంటుందని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. లిక్కర్‌ను ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించి, లారీ డ్రైవర్ లాలు భరత్, క్లీనర్ ఉదయ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.