స్పాట్లోనే రూ.30 లక్షలు కట్టేసిన భక్తుడు.. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న ఈ శంకర్ రెడ్డి ఎవరు..?

స్పాట్లోనే రూ.30 లక్షలు కట్టేసిన భక్తుడు.. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న ఈ శంకర్ రెడ్డి ఎవరు..?

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు టీవీలకు అతుక్కుపోయి ఆసక్తిగా వీక్షించిన బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం ముగిసింది. బాలాపూర్ గణనాథుని లడ్డూ ప్రసాదాన్ని కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి రూ.30 లక్షల వెయ్యి రూపాయలకు వేలంలో సొంతం చేసుకున్నారు. వినాయకుడి లడ్డూ ప్రసాదం దక్కించుకోవడం కోసం అంత ధరను  వెచ్చించిన ఈ కొలన్ శంకర్ రెడ్డి ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. 

కొలన్ శంకర్ రెడ్డి ఒక రాజకీయ నేత అని తెలిసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కొలన్ శంకర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కొలన్ కుటుంబం బాలాపూర్ గణేశుడి లడ్డూను దక్కించుకోవడం ఇది తొలిసారి కాదు.

1997 నుంచి బాలాపూర్ లడ్డూ వేలంలో కొలన్ కుటుంబం పాల్గొంటుండటం విశేషం.1997లో రూ.28 వేలకు కొలన్ కృష్ణారెడ్డి బాలాపూర్ లడ్డూ దక్కించుకున్నాడు. 1998లో రూ.51 వేలకు కొలన్ మోహన్ రెడ్డి, 2004లో రూ.2 లక్షలకు కొలన్ మోహన్ రెడ్డి, 2008లో రూ.5 లక్షల 7 వేలకు కొలన్ మోహన్ రెడ్డి, 2010లో రూ.5 లక్షల 35 వేలకు కొలన్ శ్రీధర్ బాబు, 2011లో రూ.5 లక్షల 45 వేలకు కొలన్ బ్రదర్స్, 2019లో రూ.17 లక్షల 50 వేలకు కొలన్ రాంరెడ్డి బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని వేలంలో నెగ్గి దక్కించుకోవడం విశేషం. 

మొత్తంగా కొలన్ కుటుంబం ఇప్పటికి ఏడుసార్లు బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని వేలంలో సొంతం చేసుకుంది. 2024లో బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్న బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి వేలం పాట ముగిసిన వెంటనే మొత్తం డబ్బును నిర్వాహకులకు అందజేశారు. బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం ద్వారా వచ్చిన డబ్బును బాలాపూర్ గ్రామ అభివృద్ధికి నిర్వాహకులు వినియోగించనున్నారు.