ఆ ముగ్గురు రైల్వే అధికారుల వల్లే యాక్సిడెంట్.. సీబీఐ ఛార్జిషీట్

ఆ ముగ్గురు రైల్వే అధికారుల వల్లే యాక్సిడెంట్.. సీబీఐ ఛార్జిషీట్

ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఘటనకు కారణమైన వారిగా పేర్కొంటున్న ముగ్గురు రైల్వే ఉద్యోగులకు వ్యతిరేకంగా సంస్థ చార్జిషీట్‌ దాఖలు చేసింది.  

సీనియర్ ఇంజినీర్‌ అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజినీర్‌ మహమ్మద్‌ అమీర్ ఖాన్, టెక్నీషియన్‌ పప్పు కుమార్‌లపై హత్య, సాక్ష్యాలు ధ్వంసం చేశారనే అభియోగాలు మోపారు.

వీరిని  జులైలో సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూన్‌ 2న బాలాసోర్‌లోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌ వద్ద లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలునుకోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన విషయం విదితమే. 

దాని బోగీలు పక్కన ఉన్న పట్టాలపై పడటం... అదే సమయంలో వచ్చిన యశ్వంత్‌పూర ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొట్టి పట్టాలు తప్పడం.. మూడు రైళ్ల ప్రమాదానికి దారి తీసింది. 

ఈ యాక్సిడెంట్ లో సుమారు 290 మంది మరణించగా, వేల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ప్రమాదంపై విచారణ చేపట్టి మానవ తప్పిదమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. 

ఈ క్రమంలో ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు.