ఫిబ్రవరి1న బల్దియా బడ్జెట్​ సమావేశం

ఫిబ్రవరి1న బల్దియా బడ్జెట్​ సమావేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే నెల 1న బల్దియా కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో 2025–26 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి స్టాండింగ్ కమిటీ ఆమోదించిన రూ.8,440 కోట్ల బడ్జెట్​పై చర్చించనున్నారు. ఇప్పటికే కార్పొరేటర్ల నుంచి అధికారులు ప్రశ్నలను సేకరించారు. కౌన్సిల్ ఏర్పడి నాలుగేండ్లు కావస్తుండడంతో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలయ్యాయనే దాంతో పాటు అభివృద్ధి, సమస్యలు, చేసిన పనులపై చర్చకు కార్పొరేటర్లు పట్టుబట్టే అవకాశమున్నట్టు సమాచారం.

 బడ్జెట్​ను ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సభ్యులు ఒకసారి తిరస్కరించిన తర్వాత ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్​ నుంచి గెలిచిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. కాంగ్రెస్ ​ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో చేరారు. స్టాండింగ్ కమిటీ మెంబర్స్​ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్​, ఎంఐఎంకి చెందినవారే ఉండడంతో మేయర్ కు మద్దతుగా ఎవరూ లేరు.దీంతో బడ్జెట్​కు వెంటనే ఆమోదం లభించలేదు. ఇదే విధంగా కౌన్సిల్ లోనూ బడ్జెట్​కు ఆమోదం లభిస్తుందా? లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ లో 150 మంది కార్పొరేటర్లుండగా, కాంగ్రెస్​ నుంచి ముగ్గురు మాత్రమే గెలుపొందారు. వివిధ పార్టీలోంచి చేరిన కార్పొరేటర్లతో కలిపి  ఆ పార్టీ బలం 24కు చేరింది.