- నిరుడి కంటే రూ.500 కోట్లు పెంచే చాన్స్
- ఈ నెల 30న స్టాండింగ్ కమిటీ ముందుకు రానున్న ప్రతిపాదిత బడ్జెట్ ఫైల్
- అదే రోజు ఆమోదం.. తర్వాత కౌన్సిల్ లో చర్చ
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8,500 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 30న స్టాండింగ్ కమిటీ ముందుకు బడ్జెట్ ప్రతిపాదనలు రానున్నాయి. బల్దియా 2024-–25 బడ్జెట్రూ.7,937 కోట్లు కాగా, వచ్చే ఏడాదికి సంబంధించి మరో రూ.500 కోట్లు పెంచే అవకాశం కనిపిస్తున్నది. 2021–22లో బడ్జెట్ అంచనాలు రూ.5,600 కోట్లు, 2022-–-23లో రూ. 6,150 కోట్లు, 2023--–24లో రూ.6,224 కోట్లు, 2024-–25లో రూ.7,937కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. శనివారం ప్రత్యేకంగా స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్ ను ఆమోదించే ఛాన్స్ ఉంది.
ఈసారి ఆలస్యం....
వాస్తవానికి అక్టోబర్ లోనే బడ్జెట్ కి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంటుంది. బల్దియా కమిషనర్ ప్రతి ఏడాది నవంబర్ 10లోగా స్టాండింగ్ కమిటీకి బడ్జెట్ అంచనాలను సమర్పించాలి. స్టాండింగ్కమిటీ ఆమోదించి నవంబర్15వ తేదీ లోగా కౌన్సిల్ ముందుంచాలి. వచ్చే ఏడాది జనవరి10లోగా జనరల్‌బాడీ మీటింగ్‌పెట్టి సమీక్షించి ఫిబ్రవరి20 లోపు ఆమోదించాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పుల తర్వాత ఫిబ్రవరి 20లోపు అంచనాలను మంజూరు చేయాలి. మార్చి7లోపు ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే ఈ నెల10వ తేదీతో గడువు ముగిసి 15 రోజులైనా బల్దియా అధికారులు ఇంకా అంచనాలు ఖరారు చేసే పనిలోనే ఉన్నారు. కమిషనర్ ఎన్నికల డ్యూటీలో భాగంగా జార్ఖండ్ వెళ్లడం ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.
Also Read:-మామునూర్ ఎయిర్‍పోర్ట్ భూముల్లో.. ఇదే ఆఖరు పంట
ఇది ఐదో బడ్జెట్
ప్రస్తుతం కొనసాగుతున్న కౌన్సిల్ ఐదో బడ్జెట్‌కి ఆమోదం తెలపనున్నది. గ్రేటర్ ఎన్నికలు జరిగి నాలుగేండ్లు మాత్రమే అయినప్పటికీ ఈ పాలకమండలికి ఐదుసార్లు బడ్జెట్ కు ఆమోదం తెలిపే అవకాశం లభించింది. 2020 నవంబర్ లోనే గ్రేటర్ ఎన్నికలు జరిగినప్పటికీ.. అంతకు ముందు పాలకమండలికి గడువు ఉండడంతో ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగింది. 2021–22 బడ్జెట్ కి సంబంధించి స్టాండింగ్ కమిటీ అప్రూవల్ వచ్చినప్పటికీ కౌన్సిల్ ఆమోదించకుండానే పాలకమండలి గడువు ముగిసింది. 2021 జనవరిలో జనరల్ బాడీ మీటింగ్నిర్వహించాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా సమావేశం నిర్వహించలేదు. తర్వాత ఫిబ్రవరి 11న ప్రస్తుత కౌన్సిల్ ఏర్పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకమండలి అదే ఏడాది జూన్ 26న వర్చువల్ మీటింగ్ ద్వారా బడ్జెట్ ను ఆమోదించింది. 2020 మాదిరిగా గ్రేటర్ ఎన్నికలను వచ్చే ఏడాది నవంబర్ లో నిర్వహిస్తే ప్రస్తుత పాలకమండలికి ఇదే చివర బడ్జెట్ అవుతుంది.