హైదరాబాద్, వెలుగు: సిటీలో స్ట్రీట్ లైట్ల మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యం చేయొద్దని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి స్పష్టంచేశారు. శుక్రవారం ఈఈఎస్ఎల్ ప్రతినిధులు, అడిషనల్ కమిషనర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. రెయిన్ సీజన్ కావడంతో రాత్రిపూట డార్క్ స్పాట్లు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని ఏజెన్సీలను ఆదేశించారు.
బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బంది రాకుండా అదనపు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈఈఎస్ఎల్ ప్రతినిధులు, అడిషనల్ కమిషనర్ (ఎలక్ట్రిసిటీ) సత్యనారాయణ, ఈఈ మమత, ఇన్ చార్జ్ ఎస్ఈ సంతోష్, ఏఈ దివ్య పాల్గొన్నారు.
2 రోజులు బర్త్, డెత్ సర్టిఫికెట్లు బంద్
బల్దియాలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. దీంతో మీసేవ సెంటర్ల వద్ద జనం క్యూ కట్టారు. సర్టిఫికెట్ అప్రూవ్ మెసేజ్ వచ్చినా ప్రింట్ తీసుకునేందుకు రావడంలేదు. రెండురోజులుగా ఇదే పరిస్థితి ఉండగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హెడ్ ఆఫీసులో సర్వర్ల అప్ గ్రెడేషన్ తోనే ప్రాబ్లమ్ వచ్చినట్టు గుర్తించి శుక్రవారం సాయంత్రం పరిష్కరించారు.