- ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్
- పలు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
- ఉద్యోగుల సెలవులు రద్దు చేసిన బల్దియా కమిషనర్ ఆమ్రపాలి
హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవులను రద్దు చేశామని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. జోనల్ కమిషనర్లు 24 గంటలు రోడ్లపైనే ఉంటున్నారని చెప్పారు. ఆదివారం బల్దియా అధికారులతో కలిసి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ (సంపు) నిర్మాణ పనులును పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ వాటర్ లాగింట్ పాయింట్స్, మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్ సాగర్ పై నిరంతరం నిఘా పెట్టామన్నారు. ట్రాఫిక్ రిలేటెడ్ 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయని, అక్కడ పంపులు పెట్టి నీటిని తొలగిస్తున్నామన్నారు.
22 చెరువులు సర్ ప్లేస్ కు వచ్చాయన్నారు. సాగర్ నుంచి 10,400 క్యూసెక్కులను కిందికి వదులుతున్నామని, లోతట్టు పాంత ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. మరోవైపు హుస్సేన్ సాగర్, అశోక్ నగర్, విద్యా నగర్, పద్మ కాలనీల్లోని నాలాలను డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ సీఈ దేవానంద్ లతో కలిసి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, హెచ్ఎండీఏల కు చెందిన 610 అధికారిక బృందాలు ఫీల్డ్ లో అందుబాటులో ఉన్నాయన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ 210, హైడ్రాకి 139 లకిపైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. కాగా, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్నిర్వహించారు. కన్స్ట్రక్షన్ సైట్లలో పనులు ఆపాలని, లేబర్ ను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆపద సమయంలో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం, ఫోన్ నెంబర్ 040-– 21111111 కు గాని , మై జీహెచ్ఎంసీ యాప్ కు ఆన్ లైన్ ద్వారా గానీ, డీఅర్ ఎఫ్(హైడ్రా) ఫోన్ నంబర్ 9000113667 లో సంప్రదించవచ్చని మేయర్ సూచించారు.
హైడ్రా కమిషనర్ పర్యటన
హైడ్రా కమిషనర్ రంగనాథ్ టోలిచౌకీ, షేక్ పేట్, బేగంపేట్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించి నాలాల పరిస్థితి తెలుకున్నారు. కాలనీల్లో నీరు ఎందుకు చేరుతుందన్న వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఓవర్ ఫ్లో అవుతున్న డ్రైనేజీ లైన్లను పరిశీలించారు.
మూసీని పరిశీలించిన కలెక్టర్
జియగూడ పక్కన మూసీ వరద నీటి ప్రవాహ వేగాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించి లోతట్టు ప్రాంత ప్రజలతో మాట్లాడారు. జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని మూసిలోకి వదులుతారని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి రెండు గంటల ముందే సహాయ శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్, 040-23202813 / 9063423979 కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయాలన్నారు. జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆఫీసర్లు డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.
వాటర్బోర్డు ఎండీ టెలీ కాన్ఫరెన్స్
మెట్రోవాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆదివారం ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్నిర్వహించారు. అధికారులు ఫీల్డ్లెవెల్లో పర్యవేక్షించాలని, సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. జనాలకు క్లోరిన్బిల్లలు పంపిణీ చేయాలన్నారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. సమస్యలుంటే 155313కి ఫోన్ చేయాలన్నారు.