- అదే రోజు బడ్జెట్ కు ఆమోదం
- గతేడాదితో పొలిస్తే 15 శాతం పెరిగే చాన్స్
- మేయర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్, వెలుగు : ఎట్టకేలకు బల్దియా కౌన్సిల్ మీటింగ్ తేదీని ఖరారు చేశారు. ఈనెల19న సమావేశం నిర్వహించాలని అఖిలపక్ష మీటింగ్ లో నిర్ణయించారు. అదేరోజు బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మంగళవారం మేయర్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ,ఎంఐఎం కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇందులో కౌన్సిల్ మీటింగ్ తో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించారు. శానిటేషన్, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు, స్ర్టీట్ లైట్లు తదితర అంశాలపై అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మేయర్ దృష్టి కార్పొరేటర్లు తీసుకెళ్లారు.
మూడునెలలకోసారి నిర్వహించాల్సిన కౌన్సిల్ సమావేశం ఆలస్యమైతే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని అసహనం వ్యక్తంచేశారు. అధికారులు తమ ఫోన్లు కూడా ఎత్తడంలేదని, ఏ పని చెప్పినా పట్టించుకోవడంలేదని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సామల హేమ, బన్నల గీతా, సతీశ్, సింధూ రెడ్డి, బీజేపీ నుంచి శ్రావణ్, వంగా మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రజితారెడ్డి, విజయారెడ్డి, సీఎన్ రెడ్డి, ఎంఐఎం నుంచి మీర్జా ముస్తఫా బేగ్, సయ్యద్ మింజఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిశాకే మీటింగ్ పెట్టాలనుకున్నం : మేయర్
మూడేండ్లలో ఏ ఒక్క మీటింగ్ కూడా మంచిగా జరగలేదని అనుకుంటున్నానని, ఇకపై సభ్యులు సహకరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. అసెంబ్లీ సెషన్స్ తర్వాత ఈనెల19న కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని, అదే రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ తో కౌన్సిల్ జరపలేదని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశాక మీటింగ్ పెట్టాలని అనుకున్నామన్నారు. అలాగే స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై కమిషనర్ కు పదేపదే చెప్పామన్నారు.
అంతలోనే బీజేపీ కార్పొరేటర్లు హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు. సీఎంను కలిసి స్టాండింగ్ కమిటీ, జనరల్ బాడీపై చర్చించానన్నారు. అన్ని ప్రశ్నలపై చర్చ జరిగేలా సహకరించాలన్నారు. మీటింగ్ రెండు రోజులు జరిగేలా చూస్తానన్నారు. కమిషనర్ తన మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. గత ప్రభుత్వం చాలా డెవలప్ చేసిందని, అందుకే బీఆర్ఎస్కు గ్రేటర్లో సీట్లు ఎక్కువగా వచ్చాయన్నారు.
అప్పుల పాలైన బల్దియా : కాంగ్రెస్కార్పొరేటర్లు
జోనల్ కమిషనర్లు ఫోన్లు ఎత్తడం లేదని, ఇలాగైతే డివిజన్లలో పనులు ఎలా జరుగుతాయని కార్పొరేటర్ రజితారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై మేయర్ చర్చించాలని కోరారు. గత ప్రభుత్వం బల్దియాను వాడుకుందని, అధికారులను తమ చేతుల్లో పెట్టుకుందని కార్పొరేటర్ విజయారెడ్డి ఆరోపించారు. మేయర్ కు, కమిషనర్ కు పొంతన కుదరడం లేదన్నారు. జనరల్ బాడీకి కమిషనర్ ఒప్పుకోవడంలేదని మేయర్ అంటున్నారని
వాళ్లు ఇద్దరు మాట్లాడుకొని చర్చించాలని చెప్పారు. అప్పల పాలైన బల్దియాను కాంగ్రెస్ ప్రభుత్వమే కాపాడుతుందని, పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. గతంలో మాదిరిగా కార్పొరేటర్లకు ఫండ్స్ కేటాయించాలని, వచ్చే సమావేశంలో మీడియాకు ఎంట్రీ ఇవ్వాలని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి డిమాండ్ చేశారు.
జలగల్లా పీక్కు తింటున్నరు : బీజేపీ కార్పొరేటర్లు
బల్దియా అధికారులు ప్రజలను జలగల్లా పీక్కు తింటున్నారని, అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ కార్పొరేట్లు శ్రవణ్, వంగ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. అఖిలపక్ష మీటింగ్ తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. బల్దియాలోకి డిప్యూటేషన్ పై వచ్చిన వారే ఏలుతున్నారని, ఏండ్లుగా తిష్టవేశారని, కుక్క కాటు నుంచి నాలాల వరకు అన్ని పనుల్లో ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు.
కౌన్సిల్ మీటింగ్ మూడు నెలలకోసారి నిర్వహించాల్సి ఉండగా ఏర్పాటు చేయడంలేదని, చివరకు హైకోర్టుని ఆశ్రయిస్తే తప్ప నిర్వహించడంలేదన్నారు. వచ్చే మీటింగ్ లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.