భవన నిర్మాణ అనుమతులతో బల్దియాకు రూ.815.76 కోట్ల ఆదాయం

భవన నిర్మాణ అనుమతులతో బల్దియాకు రూ.815.76 కోట్ల ఆదాయం
  •     ప్రభుత్వ సహకారంతో గ్రేటర్​లో ఎన్నో కొత్త పనులు
  •     జీహెచ్ఎంసీ యాన్యువల్​రిపోర్టును విడుదల చేసిన మేయర్​

హైదరాబాద్ సిటీ, వెలుగు :  టీజీ బీపాస్ ద్వారా 2024లో మొత్తం 14,043 భవన నిర్మాణ అనుమతులు జారీ చేశామని, వాటి ద్వారా రూ.815.76 కోట్ల ఆదాయం వచ్చిందని మేయర్​గద్వాల్​విజయలక్ష్మి తెలిపారు. 2024లో చేపట్టిన పనులు, కొత్త సంవత్సరంలో చేపట్టనున్న పనులకు  సంబంధించిన యాన్యువల్​రిపోర్టును మంగళవారం రిలీజ్ చేశారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ ఫరెన్సీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(హెచ్ సిటీ)  ప్రాజెక్టు ద్వారా 38 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, వీటిలో 27 రోడ్ల అభివృద్ధి ప్రతిపాదనలు ఆమోదం పొందాయన్నారు.

హెచ్ సిటీలో భాగంగా ఎస్ఆర్డీపీ పనులకు రూ.5,937 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. 2024లో రూ.1,91.98 కోట్ల నిర్మించిన బైరామల్ గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్, కుడి వైపు లూప్ కవర్, ఎడమవైపు లూప్ కవర్ ఫ్లై ఓవర్లను సీఎం చేతుల మీదుగా ప్రారంభించామన్నారు.  ఎస్ఎన్డీపీ ఫేజ్–2 కింద రూ.528.51 కోట్ల  వ్యయంతో 46.70 కిలోమీటర్ల పొడవుతో మొత్తం 34  నాలాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 6 పనులను పూర్తిచేశామన్నారు.  రూ.100 కోట్లతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

విజయనగర్ కాలనీ ఫుట్‌బాల్ మైదానం, అంబర్‌పేట్ మైదానం, గోల్కొండ ఓవైసీ మైదానంలో ఫుట్‌బాల్ గ్రౌండ్ల అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందిరా పార్క్ టెన్నిస్ కోర్టులో జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ల నిర్వహిస్తామన్నారు. శానిటేషన్, ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల సిబ్బంది ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ ప్రక్రియను అమలు చేసినట్లు, దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు అటెండెన్స్ లో ఎటువంటి అవకతవకలు తావు లేకుండా ఉందన్నారు.