- 8వ తేదీ దాటినా పర్మినెంట్ ఎంప్లాయీస్‌కి అందని వేతనం
- పీఆర్సీతో ఈ నెల మరింత ఆలస్యం
- పెరిగిన జీతాలతో జీహెచ్ఎంసీపై రూ.36 కోట్ల భారం
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో ఉద్యోగులకు 8వ తేదీ దాటినా జీతాలు అందలేదు. పర్మినెంట్ ఎంప్లాయీస్‌కి గత నెల వరకు 4వ తేదీలోగా జీతాలు వచ్చాయి. జులై నుంచి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తో పెంచిన వేతనాలు వేయాల్సి ఉంది. కానీ ఈ నెల హెడ్డాఫీసులో పనిచేసే కొందరికి మాత్రమే వేతనాలు రాగా..జోన్లలో పనిచేసేవారికి ఇంకా అందలేదని అక్కడి ఎంప్లాయీస్ చెప్తున్నారు. 90 శాతం మందికి ఇంకా జీతాలు అందలేదని సమాచారం. జీహెచ్ఎంసీలో మొత్తం 27 వేల మంది పనిచేస్తున్నారు. ఇందులో పర్మినెంట్ ఎంప్లాయీస్ 4 వేల వరకు ఉన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన 23 వేల మంది పనిచేస్తుండగా..పెన్షనర్లు 7,500 మంది ఉన్నారు. వీరిలో కొందరికి మాత్రమే పీఆర్సీ వర్తిస్తుంది. నెల క్రితం వరకు కేటగిరీ వారీగా జీతాలు చెల్లించినప్పటికీ ఈ నెల మాత్రం ఇంకా రాలేదంటున్నారు. ఇక ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్, సిబ్బందికి ఏడాది కాలంగా ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ మధ్యలో జీతాలు ఇస్తున్నారు. గతంలో వేతనాలు, పెన్షన్స్ కోసం ప్రతి నెల రూ. 120 కోట్లు ఖర్చు అయ్యేది. జులై నుంచి పీఆర్సీ తో బల్దియాపై నెలకు రూ.36 కోట్ల భారం పడనుంది. జులై వేతనాలు అందించాలంటే ఇక నుంచి నెలకి రూ.156 కోట్లు అవసరం కాగా... ప్రస్తుతం బల్దియా ఖాజనా ఖాళీ కావడంతోనే వేతనాలు వేయలేదని తెలుస్తోంది. టైమ్ కి జీతాలు రాకపోతే ఇంటి అద్దె, ఈఎంఐలు, లోన్లు ఎలా చెల్లించాలని పర్మినెంట్ ఎంప్లాయీస్ ఆందోళన చెందుతున్నారు. టైమ్‌కి ఈఎంఐలు చెల్లించకపోతే చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, దీంతో సిబిల్ స్కోర్ పడిపోవడంతో పాటు పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోందంటున్నారు.