- వేరే మార్గం లేక ఆస్తి పన్ను వసూళ్లపైనే ఫోకస్
- ఇబ్బందుల్లో సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. జీహెచ్ఎంసీ తమ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు చెల్లించేంది. కానీ ఇది ఒకప్పుడు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఒకటో తేదీన జీతాలు చెల్లించిన దాఖలాలు లేవు. ఏడాది కాలంగా పరిస్థితులు మరీ అధ్వానంగా మారాయి. ఒక్కొక్కరికి ఒక్కో రోజు వేస్తున్నారు. దీంతో వేతనాలు ఎప్పుడు అందుతాయో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఖాతాలో డబ్బు లేక..
జీహెచ్ఎంసీలో మొత్తం 27వేల మంది సిబ్బంది ఉండగా, ఇందులో పర్మినెంట్ ఎంప్లాయీస్ 4 వేలు, పెన్షనర్లు 7500, మిగతావారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. అందరి వేతనాలు కలిపితే నెలకి రూ.156 కోట్ల అవసరముంటుంది. గ్రేటర్ లో ఆరు జోన్లు ఉండగా జోనల్ స్థాయిలో ఒకటో తేదీ నాటికే జీతాల చెక్కులను రెడీ చేసి ఉంచుతున్నప్పటికీ.. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో ఆ చెక్కులను డిపాజిట్ చేయడంలేదు. డబ్బులు ఉన్నాయని ఫైనాన్స్విభాగం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే చెక్కులు డిపాజిట్ చేస్తున్నారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో జోన్‌కి జీతాలు వేస్తున్నారు. గతేడాది ఓ నెలలో 15వ తేదీ వరకు సాలరీ వేయలేదు. ఇలా జీతం ఏ తేదీన వస్తుందో తెలియక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. టైమ్ కి రాక, కొందరు ఈఎంఐలు చెల్లించకపోవడంతో చెక్కులు బౌన్స్ అవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీతాలు టైమ్ కి పడేలా చూడాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్చేస్తున్నాయి.
స్పెషల్ ఫోకస్
ప్రాపర్టీ ట్యాక్స్ డబ్బులపైనే జీహెచ్ఎంసీ ఆధారపడుతోంది. ప్రతినెలా ఆడబ్బులు జమైతేనే జీతాలు వేస్తున్నారు. గత నెల కూడా 6వ తేదీన జీతాలు వేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న బల్దియాకు ఇతర ఆదాయ మార్గాలు లేకపోవడంతో కమిషనర్ సహా ఉన్నతాధికారులంతా ప్రాపర్టీ ట్యాక్స్వసూళ్లపైనే ఫోకస్‌పెట్టారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ లోకేశ్ కుమార్ రెగ్యూలర్ గా సమావేశాలు నిర్వహిస్తూ ప్రాపర్టీ ట్యాక్స్కలెక్షన్ పై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ట్యాక్స్‌పేయర్స్‌కి రోజూ మెసేజ్ లు పంపడంతో పాటు బకాయిలు ఉన్నవారి ఇంటికి రెగ్యూలర్ గా వెళ్లి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు.
ఈ ఏడాది భారీగానే..
గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి భారీగానే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.1357 కోట్లు, 2020–21కి సంబంధించి రూ.1633 కోట్లు, గతేడాది 2021–22 రూ.1495 కోట్లు వచ్చింది. కాగా ఈ ఆర్థిక సంవత్సారానికి మరో నెల మిగిలి ఉండగానే రూ.1515 కోట్లు వచ్చింది. దీంతో రూ.2000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతామన్న ధీమాను జీహెచ్ఎంసీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలు ఎర్లీబర్డ్ లాంటి స్కీమ్స్‌కి స్పందిస్తున్నారు. ఈ ఏడాది ఈ స్కీమ్ కింద జీహెచ్ఎంసీకి రూ.748 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కలెక్షన్ లోపంతోనే ఆదాయం రావడంలేదని భావించిన బల్దియా ఉన్నతాధికారులు అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం కలెక్షన్ పెరిగింది.
జీతాలు టైంకి ఇయ్యాలె
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు కూడా టైమ్ కి రావడంలేదు. దీంతో ఈఎంఐలు చెల్లించకపోవడంతో చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి టైమ్ కి జీతాలు వచ్చేలా చూడాలె.
- యు.గోపాల్, జీహెచ్ఎంఈయూ ప్రెసిడెంట్