రీఅసెస్ మెంట్ తో బల్దియాకు భారీగా ఆదాయం

రీఅసెస్ మెంట్ తో బల్దియాకు భారీగా ఆదాయం
  • వెలుగు'లో కథనాలు, మంత్రి పొన్నం ఆదేశాలతో కదిలిన రెవెన్యూ విభాగం
  • ఇంకా రీఅసెస్మెంట్ చేయాల్సిన బిల్డింగ్స్ వేలల్లో.. 
  • వందలాది కమర్షియల్ బిల్డింగ్స్.. రెసిడెన్షియల్ కేటగిరీలోనే
  • నాలుగు నెలల్లోనే రూ. 4 కోట్ల అదనపు ఆదాయం 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారమిత స్కూల్ బిల్డింగ్ తో మొదలైన రీఅసెస్మెంట్.. సుమారు మరో వెయ్యి బిల్డింగ్స్ లో కొనసాగింది. ఫలితంగా బల్దియాకు నాలుగు నెలల్లో రూ.4 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. ఒక్క ఫ్లోర్ కు పర్మిషన్ తీసుకుని, రెండు, మూడు ఫ్లోర్లను అనధికారికంగా నిర్మించినవి, రీఅసెస్మెంట్ చేయని బిల్డింగ్స్ నగరంలో వేలల్లో ఉన్నాయని, బల్దియా సిబ్బంది దృష్టి సారిస్తే కార్పొరేషన్ కు మరింత ఆదాయం సమకూరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు, అసెస్ మెంట్ లో కొందరు రెవెన్యూ సిబ్బంది, కీలక అధికారులు చేతివాటం ప్రదర్శిండంతోనే ఇన్నాళ్లు కోట్లాది రూపాయల ఆదాయం రాకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

కమర్షియల్ బిల్డింగ్స్ కు రెసిడెన్షియల్ ట్యాక్స్

 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 83 వేల అసెస్మెంట్స్ ఉన్నాయి. ఇందులో వేలాది బిల్డింగ్స్ ను రెసిడెన్షియల్ కమ్ నాన్ రెసిడెన్షియల్ గా వినియోగిస్తుండగా, మరికొన్నింటిని పూర్తి నాన్ రెసిడెన్షియల్ గా ఉపయోగిస్తున్నారు. కొందరు బిల్డింగ్స్ నిర్మాణ సమయంలో రెసిడెన్షి యల్ గా పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, హాస్పిటల్స్ లాంటి కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారు.

కానీ వాటిని మున్సిపల్ రికార్డుల్లో నాన్ రెసిడెన్షియల్ గా నమోదు చేయలేదు. దీంతో ఆ బిల్డింగ్స్ కు రెసిడెన్షియల్ ట్యాక్సే వస్తోంది. దీంతో బల్దియా ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. కరీంనగర్ పద్మానగర్ లోని అంతర్జాతీయ వ్యాపార సంస్థ వాల్ మార్ట్ బిల్డింగ్ ను రెసిడెన్షియల్ కేటాగిరీలో చూపడం గమనార్హం. ఇలాంటి బిల్డింగ్స్ చాలానే ఉన్నా మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పారమితతో మొదలై.. 


 
కరీంనగర్ పద్మానగర్ లోని పారమిత స్కూల్ బిల్డింగ్ అసెస్ మెంట్, పర్మిషన్ లోపాలపై జూన్ 13న 'వెలుగు'లో వచ్చిన స్టోరీతో కదిలిన రెవెన్యూ సిబ్బంది రీఅసెస్ మెంట్ చేసి ఏటా రూ.3.95 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ విధించారు. అప్పటి వరకు సదరు స్కూల్ బిల్డింగ్ ఓనర్ ఏటా రూ.67,132 మాత్రమే చెల్లించేవారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జూన్ 18న కరీంనగర్ బల్దియాపై నిర్వహించిన రివ్యూలో పారమిత స్కూల్ బిల్డింగ్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అంతేగాక సిటీలో ఇలాంటి అసెస్మెంట్ కాని, పర్మిషన్ లేని బిల్డింగ్స్ వివరాలు సేకరించి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఎట్టకేలకు రంగంలోకి దిగిన మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం పారమిత స్కూల్ బిల్డింగ్ తోపాటు సుమారు వెయ్యి నిర్మాణాలను గుర్తించింది. వాటన్నింటిని రీఅసెస్ మెంట్ చేయగా.. సుమారు 4 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ కొత్తగా జనరేట్ అయ్యింది. 

ట్యాక్స్ గతంలో రూ.1532.. ఇప్పుడు రూ.19,032.. 

కరీంనగర్ మున్సిపాలిటీలో ఇంజనీర్ గా పని చేస్తున్న రొడ్డ యాదగిరికి ఆయన సతీమణి పేరిట హౌసింగ్ బోర్డు కాలనీలో 5 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- 7 - 1132/2 మూడంతస్తుల ఇల్లు ఉంది. వాస్తవానికి ఒక ఫ్లోర్ కు పర్మిషన్ తీసుకుని మూడు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మించారు. ఈ ఇంటికి తక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేలా అసెస్ మెంట్ చేయడంతో కేవలం ఏడాదికి రూ.1532 మాత్రమే ట్యాక్స్ వచ్చేది.

19 ఏళ్లుగా సాగుతున్న పన్ను ఎగవేతపై బండి శ్రీనివాస్ అనే ఆర్టీఐ యాక్టివిస్టు కలెక్టర్ కు జూన్ 21న ఫిర్యాదు చేయగా.. వీ6 వెలుగులోనూ స్టోరీ పబ్లిష్ అయింది. దీంతో బల్దియా రెవెన్యూ సిబ్బంది రీఅసెస్మెంట్ చేసి రూ.19,032 ట్యాక్స్ విధించారు.