
- ఇక ఏఎంసీ, మెడికల్ ఆఫీసర్లదే బాధ్యత
- పేర్ల మార్పుల కోసం వచ్చే వాటిలోనే నకిలీలు ఎక్కువ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి చెక్ పెట్టేందుకు బల్దియా ఓటీపీ విధానాన్ని అమల్లో తీసుకొచ్చింది. ఎక్కువగా పేర్ల మార్పుల కోసం వస్తున్న వాటిలోనే ఫేక్ సర్టిఫికెట్లు ఉంటున్నట్టు గుర్తించిన కమిషనర్ఇలంబరితి ఆ దరఖాస్తులను పరిశీలించే బాధ్యతను సర్కిల్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు(ఏఎంసీ) అప్పగించారు. వారు అప్లికేషన్ను పూర్తిగా పరిశీలించి వారికి వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేస్తేనే అప్రూవల్ వస్తుంది. దీంతో ఇక ఫేక్సమస్య ఉండదని ఉన్నతాధికారులు చెప్తున్నారు.
కంప్యూటర్ ఆపరేటర్ల వల్లేనంటూ..
బల్దియాలో నెలకు 22 వేల వరకు సర్టిఫికెట్లు జారీ అవుతుంటాయి. ఇందులో 17 వేల జనన, 6 నుంచి 7 వేల వరకు మరణ ధ్రువీకరణ పత్రాలుంటాయి. ఇందులో 30 శాతం వరకు సర్టిఫికెట్ల పేర్లలో మార్పుల కోసం దరఖాస్తు చేస్తుంటారు. గతంలో ఎక్కువగా తప్పులు జరిగింది కూడా వీటికి సంబంధించిన సర్టిఫికెట్లలోనే.. దీంతో విషయం కమిషనర్దృష్టికి రావడంతో ఆయన మెడికల్ ఆఫీసర్లు, ఏఎంసీలతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. అందులో కంప్యూటర్ ఆపరేటర్ల వల్లే ఇదంతా జరుగుతోందని, తమకు తెలియకుండానే అప్రూవల్ ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు.
దీంతో ఆపరేటర్లపై విజిలెన్స్ తో పాటు ఇంటెలిజెన్స్ విచారణ జరిపించారు. వీటన్నింటికి చెక్పెట్టాలంటే ఓటీపీ విధానమే సరైనదని ఈ పద్ధతి తీసుకువచ్చారు. ఇక నుంచి జారీ అయ్యే ప్రతి సర్టిఫికెట్ కి సంబంధిత మెడికల్ ఆఫీసర్, ఏఎంసీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రకటించారు. అయితే, జీహెచ్ఎంసీలో 30 సర్కిల్స్ ఉండగా.. కొన్ని సర్కిల్స్లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేకంగా మెడికల్ ఆఫీసర్లుండగా, ఇంకొన్ని సర్కిల్స్ ఏఎంసీలకు బాధ్యతలకు అప్పగించారు. రోజూ వందల్లో ఓటీపీలు వస్తుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు.