
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఇట్లనే ఉంటుందా అంటూ బల్దియా మేయర్ గుండు సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ఆఫీస్ను ఆమె ఆకస్మిక తనిఖీ చేస్తూ వివిధ సెక్షన్ల సందర్శించి, సిబ్బంది విధి నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ ఛాంబర్ కింది వైపున ఉన్న సెల్లార్ ఏరియాతోపాటు ఆఫీస్‌లోని ఇన్ వార్డ్ కంట్రోల్ రూమ్ ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ జనన, మరణ ధ్రువీకరణ సెక్షన్, పెన్షన్ సెక్షన్, అకౌంట్స్ సెక్షన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించి జాబ్ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడే పార్కింగ్ చేసిన వాహనాల సమాచారాన్ని అడిగి తెలుసుకొని కార్యాలయ సిబ్బంది, కార్పొరేటర్ల వాహనాలు కాకుండా ఇతర ప్రైవేట్వాహనాలు సెల్లార్లో పార్కు చేయడానికి వీలు లేదన్నారు.
సెల్లార్ లోని చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనంతరం బల్దియా హెడ్ ఆఫీస్‌లోని ఇన్ వార్డులో సిబ్బంది నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి వారు చేపట్టే జాబ్ చార్ట్ ను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల అధికారులతో మేయర్ సమావేశమై ఆకస్మికంగా తనిఖీలో గుర్తించిన ఇంజినీరింగ్ పనులు, పరిపాలన భవనాన్ని కలరింగ్ చేయాలని ఆదేశించారు. కౌన్సిల్ హాల్ పునరుద్ధరణ, నవీకరణ పనులను మేయర్ పరిశీలించి సమర్ధంగా నిర్వహించుటకు ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు మేయర్ పలు సూచనలు చేశారు. కాగా, బల్దియాలోని ఎలక్ట్రికల్ ఉద్యోగులు జీతాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.