బల్దియాను ప్రజలే కాపాడుకోవాలి

దుబ్బాక రిజల్ట్​తో షాక్​ తిన్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆస్తి పన్ను తగ్గింపు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపు తదితర హామీలతో వరాలు కురిపించడం మొదలుపెట్టారు. దుబ్బాక దెబ్బకే ఇంత మార్పు వస్తే బల్దియా ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే తరహా తీర్పు ఇస్తే అధికార మత్తు వీడి ప్రజల అవసరాలపై రూలింగ్​ పార్టీ దృష్టి పెడుతుంది. ప్రతిపక్షాలు రెడీ కాకముందే, అభ్యర్థుల ఎంపిక జరపక ముందే జీహెచ్ఎంసీ నోటిఫికేషన్​ ఇస్తే ఈజీగా ఎక్కువ సీట్లు గెలవొచ్చని, దాని ద్వారా దుబ్బాక ఓటమిని మరిచిపోయేలా చేయొచ్చనే ఉద్దేశంతో అధికార పార్టీ గ్రేటర్​ ఎన్నికలకు సిద్ధమైంది. అయితే టీఆర్ఎస్​కు ధీటుగా ప్రతిపక్షాలు ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా బీజేపీ ప్రచారంలో దూసుకుపోవడం అధికార పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు పలకడంతో, మా పార్టీ కార్యకర్తలు కూడా బీజేపీ విజయం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోను చూస్తే మరీ విచిత్రంగా ఉంది. అందులో ఇచ్చిన హామీలన్నీ గతంలో వారు చెప్పినవి, చేయకుండా మర్చిపోయినవే.

గందరగోళంతో గెలవాలనుకుంటున్నారు

జీహెచ్ఎంసీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికో, రాష్ట్ర ప్రభుత్వానికో సంబంధించినవి కావు. కానీ తాము లేకపోతే హైదరాబాద్ అభివృద్ధి కష్టమన్నట్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులూ మాట్లాడుతున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా కేసీఆర్, మంత్రులు దత్తత తీసుకున్న ప్రాంతాల్లో కూడా సమస్యలు అలాగే ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్​ ఇస్తున్న హామీలన్నీ వారిక్కడ గెలవకపోయినా రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సినవి, చేయగలిగినవి. మంచినీరు, సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడానికి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలవనక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వ పనులను, జీహెచ్ఎంసీ పనులను కలిపేసి ప్రజలను గందరగోళపరిచి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

వార్డు స్థాయి పాలన కోరుకుంటున్నారు

హైదరాబాద్ వల్ల వచ్చిన ఆదాయంతో సొంత ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. నగరంలో పారిశుద్ధ్యాన్ని బాగు చేసేందుకు, గుంతలు పూడ్చేందుకు, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ఇంతవరకూ చర్యలు చేపట్టలేకపోయింది. హైదరాబాద్ లో మేయర్ ను డమ్మీగా చేసి ముఖ్యమంత్రే పరోక్ష మేయర్ లా వ్యవహరించే పాత కేంద్రీకృత రాజకీయాన్ని టీఆర్ఎస్​ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. మేయర్ అధికారాలు, అప్రజాస్వామికంగా పరోక్ష ఎన్నిక చేయడం వంటి ప్రశ్నల్ని ప్రజలు లేవనెత్తడంలేదు. తమ రోజువారీ సమస్యల్ని తీర్చుకోవడానికి నేరుగా వార్డు స్థాయిలోకి నిధులు ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, తాగునీటి కనెక్షన్ వంటివి తెచ్చుకోవడం వంటి పనులు సకాలంలో జరగాలని, వాటిని నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

వారికి ఓటేస్తే టీఆర్ఎస్​కి వేసినట్టే

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకుంటాయని అంటున్నారు. అసలు జనాలకు ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టడం మానేసి అధికార బదిలీ కోసం లెక్కలు వేసుకోవడం సిగ్గు చేటు. ఇక హైదరాబాద్ లో స్థానిక పాలనను గాలికొదిలేసి వీలున్నంత మేర కబ్జాలకు పాల్పడిన కాంగ్రెస్ ఇంకా విధానపరమైన మార్పులతో కాకుండా పాత రాజకీయం, పాత వంశపారంపర్య, దోపిడీ నాయకత్వంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తోంది. ఉనికి కోసం పోరాడుతున్న టీడీపీ, వామపక్షాల పరిస్థితిలో మార్పేమీ లేదు. పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం సంగతి అందరికీ తెలిసిందే. ఏతావాతా కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం ఇలా ఏ పార్టీకి ఓటేసినా టీఆర్ఎస్​కు ఓటేసినట్లే అన్నది బహిరంగ రహస్యం.

సరైన వారికే ఓటు వేయండి

బల్దియా ఎన్నికల్లో ఎవరు గెలిస్తే, ఏం చేస్తే హైదరాబాద్ అందరికీ భద్రమైన, సంతోకరమైన నగరంగా వెలుగొందుతుంది? అన్నదే మనకు కావాల్సింది. హైదరాబాదీలను గెలిపించే రాజకీయం, అజెండా బీజేపీ, జనసేన కూటమిది అని ధీమాగా, నూరుశాతం నిజాయితీతో చెప్పగలం. మా అభ్యర్థులకే ఓటు వేయమని అభ్యర్థించగలంగానీ డిమాండ్ చేయం, ప్రలోభ పెట్టం. మా స్వచ్ఛ రాజకీయ సంస్కృతిని, అజెండాను చూడండి. మిగతా పార్టీలతో బేరీజు వేసుకోండి. నిజాయితీగా సరైన వారికి ఓటు వేయండి. మన బల్దియాను మనమే కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమయిందన్న విషయం మాత్రం గ్రహించండి.

ఆ మూడు చోట్లే అభివృద్ధి

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఒక కన్ను గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట… మరో కన్ను ఎన్నికలు జరిగే నియోజకవర్గం అని టీఆర్ఎస్​ నేతలు ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు చెబుతుంటారు. నారాయణ్​ఖేడ్​లో ఉప ఎన్నిక సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్​ తనకు సిద్ధిపేట ఒక కన్ను, నారాయణ్​ఖేడ్​ మరో కన్ను అని చెప్పారు. నారాయణ్​ఖేడ్​ను రెండో సిద్ధిపేట చేస్తానన్నారు. వారానికి ఒకసారి నియోజకవర్గానికి వస్తానని చెప్పారు. ఆయన మాటలు నమ్మి ఓటేసి టీఆర్ఎస్​ను గెలిపిస్తే ప్రజలను మోసం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక టైంలోనూ హరీశ్​ అదే చెప్పారు. దుబ్బాక తనకు రెండో కన్ను అని, దానిని గజ్వేల్​లా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ టీఆర్ఎస్ మోసపు మాటలు గుర్తించిన దుబ్బాక ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ నియోజకవర్గాలైన గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట మాత్రమే అభివృద్ధి చెందాయి. మిగతా 116 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సీఎంవి, ఆయన కొడుకు, అల్లుడివి కాదు కదా.. అందువల్లే వాటి అభివృద్ధి జరగలేదు. అందువల్లే దుబ్బాక ప్రజలు ఆ పార్టీకి సరైన బుద్ధి చెప్పారు.

హైదరాబాద్​ ఆదాయం ఎంత? ఖర్చు చేసిందెంత?

హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమెంత? హైదరాబాద్ కోసం ఖర్చు చేసిన మొత్తం ఎంత? ఈ ఆరేండ్ల పాలన లెక్కలు తీస్తే వాస్తవాలు నిగ్గు తేలతాయి. జీహెచ్ఎంసీకి       కావాల్సింది అవినీతి లేని వార్డు స్థాయి పాలన. ఆ అజెండా ఎక్కడా టీఆర్ఎస్​ వద్ద లేదు. గతంలో కాంగ్రెస్, టీడీపీ కార్పొరేటర్ల నిర్వాకం వల్ల ఎంత ప్రజాధనం వృధా అయ్యిందో, అవినీతి పాలయిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఆ పార్టీల నేతలనే తమ పార్టీలో చేర్చుకుని కొత్త పాలన అందిస్తామంటూ టీఆర్ఎస్ మభ్యపెడుతోంది. విశ్వనగరం చేస్తామని సీఎం, మంత్రులు అంటున్నారు. అసలు ఏ విశ్వనగరంలో సీఎం, మంత్రుల పెత్తనం ఉంటుందో చెప్పండి? విశ్వనగరంలో వార్డు స్థాయిలో ప్రజల పర్యవేక్షణలో పాలన ఉంటుంది. సాధికారత గల మేయర్ ఉంటారు. ఏ విశ్వనగరంలోనూ ఇప్పుడు టీఆర్ఎస్​ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ స్థానిక ఎన్నికల ప్రచారం చేయదు. ఆరేండ్ల టీఆర్ఎస్ పాలనను, అంతకు ముందు వివిధ పార్టీల చరిత్రను చూసాక హైదరాబాద్ లో అత్యధిక శాతం ప్రజల జీవితాలు బాగుపడాలంటే, రోజువారీ పనులు వార్డు స్థాయిలో జరిగే ఏర్పాటు ఉంటే తప్ప సాధ్యం కాదనేది
స్పష్టమవుతోంది.-కూసంపూడి శ్రీనివాస్, జనసేన పార్టీ, అధికార ప్రతినిధి.