వీధి వ్యాపారుల లోన్లపై బల్దియా నిర్లక్ష్యం

వీధి వ్యాపారులకు లోన్లు రాలె

పీఎం స్వనిధిపై బల్దియా నిర్లక్ష్యం

లక్ష మందిని గుర్తించగా 15 వేల మందికే లోన్​

హైదరాబాద్, వెలుగు: వీధి వ్యాపారులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. కానీ బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రేటర్​లో వీధి వ్యాపారులకు లోన్లు అందడం లేదు. పీఎం స్వనిధి పథకంలో భాగంగా వీధి వ్యాపారుల‌కు 7 శాతం వ‌డ్డీతో రూ. 10 వేల వరకు రుణం మంజూరు చేస్తారు. ల‌బ్ధిదారులు ఈ రుణాన్ని 12 నెల‌లపాటు స‌మాన వాయిదాల‌లో చెల్లించాలి. 7 శాతం కంటే  అదనంగా చెల్లించిన వ‌డ్డీ  తిరిగి వారి ఖాతాల్లో జ‌మ చేస్తారు. అదేవిధంగా డిజిట‌ల్ లావాదేవీల ద్వారా చెల్లింపులు చేసిన వీధి వ్యాపారుల‌కు నెల‌వారీ వాయిదాలో రూ. 100 ప్రోత్సాహ‌క మిన‌హాయింపు ల‌భిస్తుంది. హైదరాబాద్​లో 2 లక్షలకు పైగా వీధివ్యాపారులు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ అధికారులు వారిని గుర్తించి లైసెన్స్​లు అందజేయడంలో నిర్లక్ష్యం  వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు లక్ష మందిని గుర్తించగా వారిలో కేవలం 15 వేల మంది ఖాతాలో మాత్రమే నగదు పడింది. 20 ఏళ్ల నుంచి వీధివ్యాపారం చేస్తున్న వారికి కూడా రుణం అందలేదు. ఇదే అంశంపై ఈ ఏడాది ఆగస్టులో సీఎస్​ సోమేష్​ కుమార్​స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటించి వీధి వ్యాపారులతో మాట్లాడారు. అప్పట్లో బల్దియా అధికారులు హడావిడి చేసి కొందరికి రుణాలు అందించారు. మరికొందరి నుంచి దరఖాస్తులు తీసుకున్నా రుణాలు మాత్రం అందలేదు. వీధి వ్యాపారుల స‌ర్వే, గుర్తింపు కార్డుల జారీ, రుణ మంజూరు ప్రక్రియ కొన‌సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రుణాల మంజూరీలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చాలా డివిజన్లలో రుణం ఇప్పిస్తామంటూ రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేశారు.  ఖైరతాబాద్​జోన్​లోని పలు డివిజన్లలో ఇలా ముందుగా డబ్బులు వసూలు చేసినా రుణాలు మాత్రం అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.

పీఎం స్వనిధి రుణం పొందడానికి కావాల్సినవి..

బ్యాంకు అకౌంట్‌, దానికి ఆధార్ కార్డు, మొబైల్ నంబ‌ర్ అనుసంధాన‌మై ఉండాలి.

జీహెచ్ఎంసీ జారీ చేసిన వీధి వ్యాపారుల గుర్తింపు కార్డు

ఫోటో ఓట‌రు గుర్తింపు కార్డు

మూడు నెలల కింద అప్లై చేసిన

పదేండ్లుగా మాసబ్​ ట్యాంక్​ దగ్గర పండ్లు అమ్ముతున్న. పీఎం స్వనిధి కింద రూ.10 వేల లోన్​ ఇస్తమని చెప్పి మూడు నెలల కింద దరఖాస్తు తీసుకున్నరు. ఆ తర్వాత మళ్లీ వాళ్లు కనిపించలేదు. నేటికీ రుణం అందలే.

– భాగ్యమ్మ, వీధివ్యాపారి

లైసెన్స్​ ఇయ్యాలె

గవర్నమెంట్​ రూ. 10 వేల లోన్​ ఇస్తున్నట్లు తెలిసింది. కానీ ఆ లోన్​ఎట్ల తీసుకోవాలో నాకు తెలియదు. నా దగ్గర వీధి వ్యాపారి లైసెన్స్​ కూడా లేదు. ఇప్పటికైనా అధికారులు వీధి వ్యాపారి లైసెన్స్​ ఇస్తే లోన్ కు అప్లయ్​ చేసుకుంట.

– కిష్టమ్మ, వీధివ్యాపారి, లక్డీకాపూల్​