- టీఆర్‌నగర్‌లో వెయ్యికి పైగా అక్రమ కబ్జా ఫ్లాట్ల గుర్తింపు
- అక్రమంగా మ్యూటేషన్ చేసిన బల్దియా ఆఫీసర్లు
- పర్మిషన్లు, మ్యూటేషన్లను నిలిపివేయాలని అప్పటి కలెక్టర్ ఆదేశాలు
2023 నవంబర్‌లో జగిత్యాలలోని టీఆర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ రషీద్, కొయ్యడ లక్ష్మి.. మ్యూటేషన్ చేసి, ఇంటి నంబర్లు కేటాయించాలని సర్కార్ అందజేసిన పట్టా కాపీతో దరఖాస్తు చేసుకున్నారు. రషీద్ పట్టాకు 9–140 అనే ఇంటి నంబర్ ఇస్తూ మ్యూటేషన్ చేశారు. పైగా రూల్స్‌కు విరుద్ధంగా పట్టా భర్త పేరు మీద ఉండగా, భార్య అజ్రా బేగం పేరు మీద మ్యూటేషన్ చేశారు. కొయ్యడ లక్ష్మి పట్టాకు 9--–53/ఏ ఇంటి నంబర్ ఇచ్చారు. 2019 బల్దియా యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ఉంటేనే మ్యూటేషన్ చేయాల్సి ఉండగా, పై రెండింటికి అవేమీ లేకున్నా పని జరిగింది. ఇలా 2021లో అక్రమార్కులు కబ్జాలు చేసి ఫేక్ పట్టాలు సృష్టించినట్లు ఆఫీసర్లు గుర్తించారు’
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని టీఆర్ నగర్‌లో గతంలో సర్కార్ అందజేసిన పట్టాలకు బల్దియా ఆఫీసర్లు అక్రమంగా మ్యూటేషన్లు చేశారు. ఇలా వెయ్యికి పైగా అక్రమ కబ్జా ఫ్లాట్లకు మ్యూటేషన్లు జరిగినట్లు తేలింది. దీనిపై ఎంక్వైరీ చేపట్టి మూడేండ్లయినా కొలిక్కి రాలేదు. గత ప్రభుత్వాల హయాంలో పట్టణ సమీపంలో సుమారు 80 ఎకరాలు సేకరించి తారక రామానగర్(టీఆర్‌నగర్) పేరుతో హౌజింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా 1986, 2006లో రెండు విడుతలుగా ప్రభుత్వం 1871 పాట్లకు పట్టాలు అందజేసింది. అనంతరం ఈ ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు తేలడంతో వీటిల్లో నిర్మాణాలకు మ్యూటేషన్లు, ఇంటి నంబర్లు ఇవ్వకూడదని అప్పటి కలెక్టర్రవి, ఆర్డీవో మాధురి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను విస్మరించి కొందరు బల్దియా ఆఫీసర్లు టీఆర్ నగర్‌లోని ప్లాట్లకు రూల్స్‌కు విరుద్ధంగా మ్యూటేషన్ చేశారు. ఈ ప్రక్రియలో రూ.లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది.
1986లో పట్టాల పంపిణీ
1986 లో అప్పటి ప్రభుత్వం పేదలకు జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 326 లో 1-02 ఎకరాలు, 327లో ఎకరం, 328లో 6.28 ఎకరాలు, 337లో 4.21 ఎకరాలు, 338/ఏలో 3.36 ఎకరాలు, 385/బీ సర్వే నంబర్ లో 3.36 ఎకరాలు, 339 లో 6.03 ఎకరాలు, 340 లో 0.31 గుంటలు, 341 లో 4.31 ఎకరాలు, 342 లో 9.26 ఎకరాలు, 439 లో 2 ఎకరాలు, 440 లో 3.30 ఎకరాలు, 442 లో 13.25 ఎకరాలు, 443 లో 7.21 ఎకరాలు, 444 లో 5.01 ఎకరాలు, 440/ఏ లో 4.19 తో పాటు రాజారాం గ్రామం లోని సర్వే నంబర్ 50, 51, 52, 54 లో 1.32 ఎకరాల భూమిని సేకరించారు.
సర్కార్ ఆదేశాల మేరకు టౌన్, కంట్రీ ప్లానింగ్ డిపార్మెంట్ ద్వారా 2125 ప్లాట్స్ ఏర్పాటు చేసేందుకు అప్రూవల్ తీసుకున్నారు. ఈ మేరకు అర్హులుగా గుర్తించిన పేదలకు 1871 ప్లాట్లకు పట్టాలు అందజేశారు. కాగా వీటిల్లో వసతులు లేకపోవడంతో 738 పట్టాదారులు మాత్రమే కేటాయించిన ప్లాట్లో ఇండ్లు నిర్మించుకున్నారు. మిగిలిన 1133 వాటిని ఖాళీగానే వదిలేశారు. వీటిపై కన్నేసిన అక్రమార్కులు సమీపంలోని కమ్యూనిటీ హాల్స్, గ్రౌండ్స్, దేవాలయాలు, మెయిన్ రోడ్లను ప్లాట్లుగా మార్చి అక్రమాలకు తెరతీశారు.
2021లో డోర్ టూ డోర్ సర్వే
బాధితుల ఫిర్యాదుతో టీఆర్ నగర్ లో జరిగిన కబ్జాలపై 2021 ఆగస్టులో ఎంక్వైరీ చేపట్టారు. ఇందుకు 16 మంది రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లతో టీం ఏర్పాటు చేసి డోర్ టూ డోర్ సర్వే చేసి 340 బెస్మెంట్, 691 నివాస ఇండ్లు, 150 ఖాళీగా ఉన్న ఇండ్లు, 178 గుడిసెలు, 33 నాన్ డొమెస్టిక్ నిర్మాణాలు, 65 ఓపెన్ ప్లాట్స్, 108 అద్దెకు ఇచ్చిన ఇండ్లు, 7 శిథిలావస్థ ఇండ్లు, 447 రేకుల షెడ్లుతో కలిపి 2019 నిర్మాణాలను గుర్తించారు.
వీటిలో 1146కి పట్టాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 464 పట్టాలు రెవెన్యూ రికార్డులకు సరిపోలేదని ఆఫీసర్లు గుర్తించారు. ఇలా మరికొన్ని పట్టాలు ఫేక్ డాక్యుమెంట్ ద్వారా కూడా అమ్మినట్లు ఎంక్వైరీలో తెల్చారు. కానీ అక్రమ కట్టడాలను, కబ్జాలను తొలగించడంతో పాటు ఫేక్ డాక్యుమెంట్స్‌ను గుర్తించడంలో ఆఫీసర్లు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. గత సర్కార్ ఒత్తడితో అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కొందరి ప్లాట్లను రెగ్యులరైజ్ చేస్తూ జీవో 58 ప్రకారం 2022లో 58, 2023లో 40 మందికి సర్కార్ పట్టాలు అందజేసింది.
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
రూల్స్ కు విరుద్ధంగా మ్యూటేషన్ లేదా ఇంటి నంబర్ కేటాయించినట్లు మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. టీఆర్ నగర్‌లో ప్రభుత్వ స్థలంలో పట్టాలు ఉన్నాయి. వీటికి ఇంటి నంబర్లు, పర్మిషన్లు, మ్యూటేషన్లు కేటాయించకూడదని ఆదేశాలు ఉన్నాయి. ఎలాంటి డాక్యూమెంట్ లేకుండా మ్యూటేషన్ కానీ ఇంటి నంబర్ కేటాయిస్తే రద్దు చేస్తాం.
పి. అనిల్ బాబు, జగిత్యాల బల్దియా కమిషనర్